iBam భాగవతం ఆణిముత్యాలు

దశమ స్కంధం

10-1 శ్రీకంఠచాప ఖండన... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రీకంఠచాప ఖండన!
పాకారి ప్రముఖ వినుత భండన! విలసత్
కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!

iBAT సందర్భం

భాగవతంలోని దశమస్కంధం నేరుగా శ్రీకృష్ణవాసుదేవుని పరమాత్మతత్త్వాన్ని ప్రపంచించే వాఙ్మయ విరాట్ స్వరూపం. పోతన మహాకవి ఆ స్కంధాన్ని ప్రారంభిస్తూ శ్రీరామచంద్రప్రభువులవారి గుణవిశేషాలను ఆత్మానందంకోసం వక్కాణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

స్వామీ శ్రీరామచంద్రప్రభూ! నీవు శ్రీకంఠుని వింటిని ముక్కలు చేసిన మహాత్ముడవు. దేవేంద్రుడు మొదలైనవారు కూడా నీ యుద్ధాన్ని నిండు గౌరవంతో కొనియాడుతారు. కకుత్స్థుడు అనే మహాపురుషుని కుదురునందు వెలుగులు నింపడానికి నీవు అందులో అవతరించిన ఆదిదేవుడవు. నీ విశాలమైన కీర్తి పూర్ణచంద్రునిలా సర్వలోకాలను ఆహ్లాద పరుస్తున్నది.
10-183 ఏమి నోముఫలమొ... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏమినోము ఫలమొ యింత ప్రొ ద్దొక వార్త
వింటి మబలలార! వీను లలర
మన యశోద చిన్ని మగవానిఁ గనె నట
చూచి వత్త మమ్మ! సుదతులార!

iBAT సందర్భం

శ్రీ వాసుదేవ పరమాత్మ తన మాయతో నందగోకులంలో సుందరశిశువై యశోద ఒడిలోనికి చేరుకున్నాడు. అందరూ ఆ నందనందనుడు యశోద కడుపున పుట్టినట్లే సంభావించారు. వ్రేపల్లెలోని గోపసుందరులందరూ ఇలా అనుకుంటున్నారు.

iBAT తాత్పర్యము

ఒయ్యోయి అబలలారా! సుదతులారా! ఈనాడు మనం వెనుకటి పుట్టువులలో చేసుకొన్న పుణ్యమెటువంటిదో కానీ ఒక వార్త వీనులవిందుగా వినబడింది. మన యశోద లేదూ, అదే నందుని ఇల్లాలమ్మా ఒక చిన్ని మగవానిని కన్నదట. వెళ్ళి చూచి వద్దామా!
10-256 బాలుం డెక్కడ... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడన్
గాలం దన్నుట యెక్క? డాటపడుచుల్ గల్లాడి? రీ జడ్డు ప
ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక యం
చాలాపింపుచుఁ వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్.

iBAT సందర్భం

పరంధాముడు బాలకృష్ణుడై లీలలెన్నో ప్రదర్శించాడు. అవి లోకంలో మరెక్కడా మరెవ్వరియందూ సంభవించేవి కావు. పసితనంలోనే బండిరూపంలో ఉన్న బండ రక్కసుని కాలితో తన్ని నేలగూల్చివేశాడు. అది విని గోపకులు, గోపికలు ముక్కున వేలు వేసుకొని ఇలా అనుకొంటున్నారు

iBAT తాత్పర్యము

పిల్లవాడెక్కడ? బండి యెక్కడ? మింటిలో విరిగి ముక్కలయ్యే విధంగా కాలితో తన్నటం ఎక్కడ? తోడి చెలికాండ్రు అబద్ధాలాడుతున్నారు. ఇటువంటి తెలివితక్కువమాట ఏ లోకంలో నైనా ఎవరైనా పలుకుతారా? ఇదేమి తీరో! అని పలువిధాలుగా పలుకుతూ గోపగోపికలు చాలా ఆశ్చర్యపడ్డారు.
10-258 అలసితివి గదన్న... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
అలసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
చన్నుఁ గుడువు మన్న! సంతసపడు మన్న!
యనుచుఁ జన్నుఁ గుడిపె నర్భకునకు.

iBAT సందర్భం

బండిని పగులదన్ని పసిపాపడైన కృష్ణుడు నంగనాచిలా ఏమీ ఎరుగనట్లు ఏడవడం మొదలుపెట్టాడు. తల్లిహృదయం తల్లడిల్లిపోయింది. ఆమె పరుగుపరుగున వచ్చి కన్నయ్యతో ఇలా అంటున్నది.

iBAT తాత్పర్యము

కన్నా! అలసిపోయావా తండ్రీ! ఆకలివేస్తున్నదా నాన్నా! మంచివాడవుగదూ! ఏడ్పుమాను నాయనా! ఇదిగో పాలు త్రాగు! సంతోషం పొందు చిన్నా! అంటూ ఆ పసివానికి పడతి యశోద పాలిచ్చింది.
10-296 తనువున నంటిన... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తనువున నంటిన ధరణీపరాగంబు; పూసిన నెఱి భూతిపూఁత గాఁగ;
ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు; తొగలసంగడికాని తునుక గాఁగ;
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు; కాముని గెల్చిన కన్ను గాఁగఁ;
కంఠమాలికలలోని ఘన నీలరత్నంబు; కమనీయ మగు మెడకప్పు గాఁగ;

(ఆటవెలది)

హారవల్లు లురగ హారవల్లులు గాఁగ;
బాలులీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.

iBAT సందర్భం

కొన్ని ఘనకార్యాలు చక్కబెట్టడానికి స్వామి వాసుదేవుడు అవసరమైనప్పుడల్లా అవనికి దిగివస్తూ ఉంటాడు. వినోదంగా ఒక తోడును కూడా తెచ్చుకుంటాడు. ఆ స్వామియే నందగోపబాలుడు కన్నయ్య. తోడై వచ్చిన మహాత్ముడు ఆదిశేషుని అంశమైన బలరాముడు. పసితనపు పరువంలోని గోపబాలుని పరికించి చూచేవారికి పరమశివుని దర్శనం కూడా అవుతున్నది.

iBAT తాత్పర్యము

కన్నయ్య తన అన్నయ్యతో పాటు ఆడుకొంటున్నాడు. ఒడలంతా దుమ్ము దుమ్మైపోయింది. అది పరమశివుడు పూసుకొన్న విభూతిలాగ వెలిగిపోతున్నది. తలమీద తెలికాంతులు వెదజల్లుతున్న ముత్యాలహారం చంద్రశేఖరుని తలమీది జాబిల్లిని తలపింపచేస్తున్నది. అమ్మ నొసటిమీద ఎఱ్ఱటి తిలకం చక్కగా పెట్టింది. అది కాముణ్ణి కాల్చివేసిన మూడవ కన్నులాగా ప్రకాశిస్తున్నది. యశోదమ్మ మెడచుట్టి వచ్చేట్టుగా ఒక చక్కనిహారం వేసింది. దానిమధ్య ఇంద్రనీలమణి మనోజ్ఞకాంతులతో ఒప్పారుతున్నది. అది శివమహాదేవుని మెడలోని నీలిమను తోపచేస్తున్నది. నిలువెల్లా హారాలే కదలాడుతూ ఉన్నాయి. అవి శివుని దేహంమీద తిరుగాడే పాములా అన్నట్లున్నాయి. ఇలా ఆ గోపబాలుడు, నిజానికి గొప్ప ప్రౌఢుడు, బాలలీలలతో ఫాలలోచనుని వలె భాసిల్లుతున్నాడు. బహుశః, మేమిద్దరము కాదయ్యా! ఆయనే నేను, నేనే ఆయన అని లోకాలకు తెలియజెప్పాలి అనే కోరిక కలిగి ఉంటుంది.
10-306 బాలురకుఁ బాలు లేవని... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలు వెట్టఁ పకపక నగి నీ
బాలుం డాలము సేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

iBAT సందర్భం

కన్నయ్య చిన్నప్పుడు చాలా చాలా చిలిపి పనులు చేశాడు. అవన్నీ తాను భగవంతుడనని ప్రకటించడం కోసమే కనుక వానిని మహాకవులూ, మహర్షులూ లీలలుగా భావించి ఆనందసాగరంలో ఈదులాడారు. ఒక గోపిక యశోదమ్మతో బాలుని లీలను ఇలా చెప్పుకొంటున్నది.

iBAT తాత్పర్యము

చక్కగా విచ్చుకొన్న పద్మాలలాగా అలరారుతున్న కన్నులు గల ఓ యశోదమ్మా! ఒక పక్క మా పసిపిల్లలకు పాలులేవని బిడ్డలను గన్న అమ్మలు మొత్తుకుంటూ ఉంటే నీ పిల్లగాడు పకపకా నవ్వుతూ పట్టనలవిగాని అల్లరిచేస్తూ దూడలను ఆవులదగ్గరకు వదలి వేశాడమ్మా!
10-307 పడఁతీ నీ బిడ్డడు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పడఁతీ! నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాఁగిన పా లా
బుడుతలకుఁ బోసి చిక్కిన
కడవలఁ బో నడిచె నాజ్ఞ కలదో లేదో?

iBAT సందర్భం

గోపికలు యశోదమ్మకు కృష్ణుని దుడుకుపనులు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవటం వారికి అదొక తృప్తి. యశోదమ్మకు ఆనందం. మహాకవి పోతన మనకు కూడా అటు వంటి తృప్తినీ ఆనందాన్నీ అందిస్తున్నారు.

iBAT తాత్పర్యము

యశోదమ్మా! నీవు కూడా ఒక ఆడదానివే కదమ్మా! చూడు నీ పోరగాడు ఏమి చేశాడో? కడవలలో మేము చక్కగా మీగడ కట్టే విధంగా కాచి దాచుకొన్న పాలను మెల్లగా మా యిళ్ళలో దూరి, దుడుకుతనంతో ఏ మాత్రమూ తీసిపోని చెలికాండ్రకు పీకల దాకా పోశాడమ్మా! కాస్తో కూస్తో మిగిలిన పాలకుండలను పగులగొట్టి పారిపోయాడమ్మా! వానిమీద నీకేమయినా అదుపూ ఆజ్ఞా ఉన్నాయటమ్మా!
10-308 మీ పాపఁడు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నన్
గోపించి పిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్మికొనుచు వచ్చెం దల్లీ!

iBAT సందర్భం

యశోదమ్మకు కన్నయ్యమీద కోపం రావాలి. అతనిని గట్టిగా శిక్షించాలి. అతడు బుంగమూతి పెట్టి కన్నులు నులుపుకుంటూ బుడిబుడి ఏడ్పులు ఏడుస్తూ ఉంటే ఆ అందమే అందం. అందుకోవాలని అంగనలు పితూరీలు చెపుతున్నారు.

iBAT తాత్పర్యము

తల్లీ! యశోదమ్మా! ఏమి చెప్పమంటావు. మీ అబ్బాయిగారు మా యింట్లో తృప్తితీరా, కడుపునిండా పాలు త్రాగాలని దూరాడు. పాపం! వాడికి పాలెక్కడా కనపడ లేదు. అప్పుడు ఆయనగారికి గొప్పగా కోపం వచ్చింది. ఇంట్లో ఉన్న మా పసిపిల్లలు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉండగా వారినందరిని చెదరగొట్టుకుంటూ బయటకు వచ్చాడమ్మా!
10-309 ఆడం జని... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆడం జని వీరల పెరుఁ,
గోడక నీ సుతుఁడు త్రావి యొక యించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రు చ్చనుచు నత్త కొట్టె లతాంగీ!

iBAT సందర్భం

ఒక చక్కని లతలాగా ఊగిపోతున్న యశోదమ్మ తల్లీ! మీవాడు వట్టి తంపుల మారివాడమ్మా! అంటున్నది ఒక గోపిక. చూడు ఎంత ఆగడం చేశాడో నీ కొడుకు

iBAT తాత్పర్యము

యశోదమ్మా! మీ పిల్లవాడు మెల్లగా ఒక యింటిలో దూరాడు. జంకుగొంకులు ఏ మాత్రమూ లేకుండా ఆ యింటిలోని పెరుగు త్రాగివేశాడు. పాపం ఆ యింటి కోడలు పిల్ల గమనించింది. ఈ మహాపురుషుడు వెంటనే ఆ పెరుగును కొంచెం తీసికొని ఆ కోడలి మూతికి అంటించాడు. ఆమె బిత్తరపోయి చూస్తూ ఉండగా అత్తగారు కోడలిని చూడనే చూచింది. భడవా! దొంగతిండి తింటున్నావా? అని కోడలికి నాలుగు వడ్డించింది
10-310 వారిల్లు చొచ్చి... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వా రిల్లు సొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యి త్రావి తుది నా కడవల్
వీ రింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!

iBAT సందర్భం

ఒక గోపిక కన్నయ్య దుడుకుతనాన్ని యశోదమ్మకు ఇలా వివరించి చెబుతున్నది

iBAT తాత్పర్యము

అమ్మా! మహాతల్లీ! మీ పాపడు ఎంత నంగనాచియో చూడు. వాళ్ళింట్లో దూరాడు. కడవలలో కమ్మగా క్రాగిన కమ్మని నేతిని అంతా పొట్టను పెట్టుకున్నాడు. ఆ కడవల నన్నింటినీ తెచ్చి వీరింట్లో పెట్టాడు. ఇంక చూడు! వాళ్ళూ వీళ్ళూ తిట్టుకొన్న తిట్లు అన్నీ ఇన్నీ కావమ్మా!
10-326 కలకంఠి మా వాడ గరితల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కలకంఠి! మా వాడ గరితల మెల్ల నీ పట్టి రాఁగల డని పాలు పెరుగు
లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ చూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ?
తలుపులు ముద్రలు తాళంబులును పెట్టి యున్న చందంబున నున్న వరయ;
నొక యింటిలోఁ నాడు నొక యింటిలోఁ బాడు నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;

(ఆటవెలది)

నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ
పక్షి ఘోషణములు పరఁగఁ జేయు
నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో
కాన రాఁడు రిత్త కడవ లుండు

iBAT సందర్భం

గొల్లభామలు ఇండ్ల తలుపులకు గట్టిగా తాళాలు వేసుకున్నారు. కృష్ణుడు ప్రవేశించటానికి పిసరంత సందు కూడా లేకుండా ఏర్పాట్లు భద్రంగా చేశారు. నిబ్బరంగా ఉండి గమనిస్తున్నారు. కృష్ణుడు ఇళ్ళలోనికి పోనేపోయాడు. వెక్కిరింతలూ వేళాకోళాలూ చేయనే చేశాడు. పాపం గొల్లభామలు యశోదకు ఇలా చెప్పుకుంటున్నారు.

iBAT తాత్పర్యము

నీ కమ్మని కంఠం మా కంఠాలను నొక్కివేస్తుందమ్మా యశోదమ్మా! మా పేట లోని ఆడవాళ్ళందరమూ కలిసి గట్టిపూనికతో ఒక పథకం వేసుకున్నాం. నీ కొడుకు వస్తాడేమో అని పాలూ పెరుగూ ఇండ్ల లోపలి గదులలో భద్రంగా పెట్టి ఎలా వస్తాడో అని ఆయనగారు వచ్చేదారిని చూస్తూ ఉన్నాము. ఇళ్ళకు వేసిన తాళాలూ, తలుపుల ముద్రలూ వేసినవి వేసినట్లుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడు దూరాడో, ఎలా దూరాడో ఇండ్ల లోపల ఉన్నాడు. ఒక ఇంటిలో ఆడుతున్నాడు. మరొక ఇంటిలో పాడుతున్నాడు. ఒక యింటిలో నవ్వుతున్నాడు. ఒక ఇంటిలో వెక్కిరిస్తూ ఉన్నాడు. ఇంకా వింతగా జంతువులా, పక్షులా కూతలు. ఎలాగైనా పట్టి కట్టిపడవేయాలని ప్రయత్నిస్తే కనపడనే కనపడడు. ఎక్కడకు పోతాడో ఏమో! ఇళ్ళలో మాత్రం ఖాళీ కడవలు కానవస్తాయి
10-328 ఓ యమ్మ నీ కుమారుఁడు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీఁ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన మంజులవాణీ!

iBAT సందర్భం

గోపికలు యశోదమ్మకు మొరపెట్టుకుంటున్నారు. శ్రీకృష్ణుని ఆగడాలను పేర్కొని ఎక్కడికైనా వెళ్ళిపోతామంటున్నారు

iBAT తాత్పర్యము

ఓయమ్మా! మంజులవాణీ! నీ కుమారుడు మా యిండ్లలో పాలూపెరుగూ బ్రతక నివ్వడు తల్లీ! ఎక్కడికైనా వెళ్ళిపోతాము. ఇది యేదో ఆషామాషీగా అంటున్నమాట కాదు తల్లీ!. మా అన్నల ఆవులమీద ఒట్టువేసి అంటున్నమాట.
10-337 అమ్మా మన్ను దినంగ... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అమ్మా! మన్ను దినంగ నే శిశువనో? యాకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మది; న్నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీ యాస్య గం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.

iBAT సందర్భం

గోపవనితలు కృష్ణుని ఆగడాలను యశోదమ్మకు చెప్పుకొని తమదారిని తాము పోయారు. ఈ అయ్యవారు ఏమీ ఎరుగని నంగనాచిలా అమ్మవడిలో ఆడుకుంటూ కూర్చున్నాడు. ఒకనాడు బలరాముడు మొదలైన గోపబాలురందరూ యశోదకు కృష్ణుడు మన్ను తింటున్నాడని చెప్పారు. ఆయమ్మ మన్నెందుకు తింటున్నావని గదమాయించింది. అప్పుడు కన్నయ్య ఇలా అన్నాడు

iBAT తాత్పర్యము

అమ్మా! మన్ను తినటానికి నేనేమైనా పసివాడనా? ఆకలి వేసినవాడనా? వెఱ్ఱి వాడనా? నీవు వీరి మాటలు మనస్సులో నమ్మవద్దు. నీవు నన్ను కొట్టాలని వీళ్ళీమార్గం కల్పించి చెబుతున్నారు. కాదంటే నా నోటివాసన చూచి నా మాటలు తప్పైతే నన్ను దండించమ్మా!
10-341 కలయో వైష్ణవ మాయయో... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁ డెంత? యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్.

iBAT సందర్భం

నా నోటివాసన చూచి మన్ను తిన్నానో లేదో తెలుసుకో అని నోరు పెద్దగా తెరచి ఆమెకు చూపాడు. యశోదకు ఆ చిన్నినోటిలో సముద్రాలతో, పర్వతాలతో, అడవులతో, భూగోళాలతో, అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు, దిక్పాలకులు మొదలైనవానితో కూడిన బ్రహ్మాండమంతా కానవచ్చింది. ఆ అద్భుత దర్శనానికి ఆమె విస్తుపోయి ఇలా అనుకుంటున్నది.

iBAT తాత్పర్యము

ఏమిటి ఇది కలయా? విష్ణువునకు సంబంధించిన మాయయా? లేక మనస్సు లోని సంకల్పాలకు కల్పనయా? లేక ఇదంతా సత్యమేనా? నా మనస్సు సరిగ్గా పని చేస్తున్నదా? అసలు నేను యశోదనేనా? ఇది మా యిల్లేనా? పరస్థలమా? వ్రేలెడంత లేని యీ బాలుడేమిటీ? ఇతని మోములో బ్రహ్మాండమంతా గొప్ప వెలుగులతో అలరారట మేమిటి? దీనికి కారణం ఏమిటో? ఇది భావించినకొద్దీ పరమాద్భుతంగా ఉన్న విషయం.
10-346 బాలుఁ డీతం డని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
బాలుఁ డీతం డని భావింతు నందునా; యే పెద్దలును నేర రీ క్రమంబు
వెఱ వెఱుంగుటకు నై వెఱపింతు నందునా; కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నాబుద్ధి వినిపింతు నందునా; తనుదాన యై బుద్ధిఁ దప్ప కుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా; చొచ్చి చూడని దొకచోటు లేదు

(ఆటవెలది)

తన్ను నెవ్వ రైనఁ దలపోయఁ బాఱెడు
నోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెక్కసక్కెముల నాడుఁ
బట్టి శాస్తి జేయు భంగి యెట్లు?

iBAT సందర్భం

ఆ కృష్ణయ్య అమ్మను అతలాకుతలం చేసివేస్తున్నాడు. అలా చేస్తున్నకొద్దీ ఆమె హృదయం ఆనందధామమే అవుతున్నది. కానీ పైకి మాత్రం ఆ అల్లరికి అడ్డుకట్టవేయాలని ఆరాటం గానూ ఉన్నది. ఒకనాడు ఉట్టిమీద గట్టిగా పెట్టిన వెన్నను ఒక కోతికి అందిస్తూ దొరకిపోయాడు. ఒక బెత్తం పుచ్చుకొని కన్నయ్య వెంటబడింది యశోద. మనస్సులో ఇలా అనుకొంటున్నది.

iBAT తాత్పర్యము

వీనిని పసివాడని అనుకొందామా అంటే యిటువంటి చేష్టలు పెద్దవాళ్ళు కూడా చేయలేరు. వినయాన్ని నేర్పటానికి కొంచెం భయపెడదామా అంటే లేక లేక కలిగిన బాలుడైనాడు. ఎప్పుడైనా ఏదైనా ఉపాయంతో నాలుగు మంచిమాటలతో బుద్ధి చెబుదామా అంటే నేను చెప్పబోయేవేళకు ఏ అల్లరీ ఆగమూ లేకుండా బుద్ధిమంతుడై కూర్చుంటాడు. మరొకదానిని పట్టించుకోకుండా ఇంట్లోనే కూర్చుంటాడా అంటే చూడని చోటు ఒక్కటికూడా ఉండదు. ఎవ్వరైనా తననుగూర్చి భావిస్తే పరుగెత్తుకొని పోతూ ఉంటాడు. ఒక పద్ధతి లేదు. భయమన్నమాట లేదు. పోనీ మాటాడకుండా ఊరకుందామా అంటే వేళాకోళాలు వెక్కిరింతలతో ఉడికిస్తూ ఉంటాడు. ఇట్టి పిల్లవానిని పట్టి శాస్తి చేసే విధం ఏమిటో తెలియటం లేదు.
10-363 నీ పద్యావళు లాలకించు... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్దులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!

iBAT సందర్భం

బాలకృష్ణుణ్ణి అమ్మ రోటికి కట్టిపడవెయ్యగా దానితోపాటు పాకుకుంటూ రెండు మద్దిచెట్ల మధ్యనుండి పోగా అవి రెండూ ఫెళ ఫెళ నాదాలతో కూలిపోయాయి. వాని నుండి ఇద్దరు గంధర్వులు నలకూబర మణిగ్రీవులై బాలునకు మోకరిల్లి నిలిచి స్తుతి చేశారు.

iBAT తాత్పర్యము

పద్మపత్రనేత్రా! పరంధామా! నీ పద్యాల వరుసలను ఆలకించే చెవులనూ, నిన్ను కొనియాడగలిగే వాక్కులనూ, నీ పేరుతో పనిచేసే చేతులజంటనూ, నీ మూర్తిపై ప్రసరించే చూపులనూ, నీ పాదాల చెంత మ్రొక్కే శిరస్సునూ, నీ సేవ చేసుకొనే చిత్తాలనూ, నీమీది బుద్ధులనూ మాకు దయతో ప్రసాదించు స్వామీ!
10-601 రా పూర్ణచంద్రిక... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ! రమ్ము భగీరథరాజతనయ!
రా సుధాజలరాశి! రా మేఘబాలిక! రమ్ము చింతామణి! రమ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ! రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! రమ్ము మందాకిని! రా శుభాంగి!

(ఆటవెలది)

యనుచు మఱియుఁ మఱియుఁ నాఖ్యలు గల గోవు
లడవిలోన దూర మందు మేయ
ఘన గభీర భాషఁ గడు నొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.

iBAT సందర్భం

సర్వభూపాలకుడైన పరమాత్మ ఇప్పుడు గోపాలకుడైనాడు. అన్నతో పాటు పసితనం దాటుకుని బాల్యం లోనికి అడుగుపెట్టాడు. ఆటపాటలన్నీ ఆవులతో, గోపాలకులతోనే! అరణ్యప్రదేశాలలో ఆ గోవులను, గోపాలకులను అలరిస్తూ తిరగడమే ఆ అయ్యగారి పని. తాను కాచుకునే ఆవులకు అందమైన పేర్లు పెట్టుకున్నాడు. వీనిని ప్రియమారా పిలుస్తూ ఉంటాడు.

iBAT తాత్పర్యము

పూర్ణచంద్రికా! గౌతమీగంగా! భాగీరథీ! అమృత సాగరమా! రండమ్మా! మేఘబాలికా! చింతామణీ! సురభీ! మనోహారిణీ! సర్వమంగళా! భారతీదేవీ! భూదేవీ! శ్రీమహాలక్ష్మీ! రండమ్మా రండి! మందమారుతీ! మందాకినీ! శుభాంగీ! గబగబా గంతులు వేసికుంటూ పరుగెత్తి రండి! అంటూ ఇంకా ఎన్నో పేర్లు గల ఆవులు అడవిలో దూరంగా మేస్తూ ఉండగా మేఘగర్జన వంటి కంఠనాదంతో పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపులకు ముచ్చటపడి గోపాలకులందరూ మెచ్చుకుంటూ ఉంటారు
10-1268 నీ పాదకమల సేవయు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాపసమందార! నాకు దయ సేయఁ గదే.

iBAT సందర్భం

కంసుడు రామకృష్ణులను తన నగరానికి పిలిపించాడు. వారు జంకుగొంకులు లేకుండా మధురానగరంలో విహరిస్తున్నారు. రాచబాటలో వారికి సుదాముడనే మాలా కారుడు కనిపించాడు. మాలికలతో స్వామిని సత్కరించాడు. కృష్ణునికి అతనిపై పరమానుగ్రహం కలిగింది. అతని యింటికి వెళ్ళాడు. కోరిన వరం ఇస్తాను అన్నాడు. అప్పుడు సుదాముడు ఇలా అన్నాడు

iBAT తాత్పర్యము

స్వామీ! నందనందనా! యశోద కుమారా! నాకు నిరంతరము నీ పాదపద్మాల సేవ కావాలి. నిన్ను భక్తితో అర్చించే పుణ్యాత్ములతో చెలిమి కావాలి. తాపసమందారా! ఎడతెగని, అంతులేని భూతదయ కావాలి. నా స్వామీ! నాయీ మూడు కోరికలనూ అనుగ్రహించు తండ్రీ.
10-1679 ఖగనాథుం డమరేంద్రు గెల్చి... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్ష చరులన్ సాళ్వాదులం గెల్చి భ
ద్రగుఁ డై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.

iBAT సందర్భం

బలరామ శ్రీకృష్ణులు పెండ్లి యీడునకు వచ్చారు. బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు రైవతుడు తన బిడ్డ రేవతిని బలరామునకు ధర్మపత్నిగా ఇచ్చాడు అని చెబుతూ శుకయోగీంద్రులు రుక్మిణి కల్యాణ ప్రస్తావనగా ఇలా చెబుతున్నారు.

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా! వెనుకటికి పక్షిరాజు గరుత్మంతుడు దేవేంద్రుణ్ణి గెలిచి అమృత భాండాన్ని తెచ్చిన విధంగా సుదర్శనమనే చక్రం ధరించిన శ్రీకృష్ణస్వామి శిశుపాలునిపక్షం వారైన సాళ్వుడు మొదలైన వారినందరినీ గెలిచి భద్రంగా రుక్మిణీదేవిని వరించాడు. ఆమె విదర్భరాజైన భీష్మకుడు కన్నబిడ్డ. పద్మాల సుగంధం ఆమెను అంటిపెట్టుకొని ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో భూమిలో అవతరించిన జగన్మాత. ఆమె మహోదాత్త గుణాలే ఆమెకు మణిభూషణాలు. ఆమె బాలికలలో మణి
10-1701 ఏ నీ గుణములు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక; దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల; కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన; భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ; దడవిన బంధసంతతులు వాయు

(ఆటవెలది)

నట్టి నీ యందు నా చిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!

iBAT సందర్భం

రుక్మిణీదేవి త్రికరణాలలో శ్రీకృష్ణస్వామినే నింపుకొన్నది. కానీ అన్న రుక్మి తనను శిశుపాలునికి ఇస్తానంటున్నాడు. తల్లిదండ్రులు ఎటూ చెప్పలేక కర్తవ్యం తోచక తల్లడిల్లి పోతున్నారు. ఈ స్థితిలో తనను సర్వవిధాలా ఉద్ధరింపగలవాడు వాసుదేవుడే అని నిర్ణయించుకుని ఒక ఉత్తమ విప్రుని ద్వారా తన సందేశం పురుషోత్తమునకు పంపింది. ఆ మహాత్ముడు అది శ్రీకృష్ణునకు వినిపిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

క్రూరాత్ముడైన కంసుని కడతేర్చిన ఓ స్వామీ! పరమనీచులను చీల్చి చెండాడే జగదేకవీరా! శ్రీయుతాకారా! చెలువల చిత్తాన్ని అపహరించే సుందరసుందరా! శ్రీకృష్ణా! నీ గుణాలు చెవులను తాకినంతనే దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ మంగళాకారాన్ని చూచినంతనే కన్నులకు చూడవలసిన లాభాలాన్నీ సిద్ధిస్తాయి. నీ పాదాలకు ఎప్పుడు సేవలు చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి భువనాలన్నింటినీ దాటుకొనిపోయే పరమసిద్ధి కలుగుతుంది. నీ శుభనామాన్ని భక్తితో పాడుకుంటే సంసారబంధాలన్నీ తెగిపోతాయి. అటు వంటి నీయందు నాచిత్తం నిరంతరంగా ఇష్టపడి ఉన్నది. దీనికి నీ ఆజ్ఞ పొందలేదు. నన్ను కరుణతో చూడు మహాత్మా!
10-1703 శ్రీయుతమూర్తి... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుంగఁ డద్భుతమైన భవత్ప్రతాపమున్

iBAT సందర్భం

రుక్మిణీదేవి సందేశంలో ఉన్న మరొక విషయాన్ని ఆ బ్రాహ్మణోత్తముడు పురుషోత్తమునకు ఇలా విన్నవిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

శ్రీయుతమూర్తీ! నీవు పురుషులలో సర్వశ్రేష్ఠుడవు. అందువలననే పురుష సింహము అని నిన్ను నేను పిలుచుకుంటున్నాను. సింహపుపాలి సొమ్మును గుంటనక్క కోరినట్లుగా నీపాద పద్మాలను మాత్రమే ధ్యానం చేసే నన్ను కండకావరంతో కన్నులు కానని శిశుపాలుడు, వడివడిగా కొనిపోవాలని ఇక్కడ ఉన్నాడు. అధములందరిలో మరింత అధముడైన ఆ నీచుడు అద్భుతమైన నీ ప్రతాపాన్ని తెలుసుకోలేక పోతున్నాడు.
10-1708 అంకిలి సెప్పలేదు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
అంకిలి సెప్పలేదు; చతురంగ బలంబులతోడ నెల్లి యో!
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్

iBAT సందర్భం

రుక్మిణి, శ్రీకృష్ణుడు తనను ప్రమాదాలనుండి ఎలా దాటించాలో, ప్రమోదంతో ఎలా ఉద్ధరించాలో స్వామికి బ్రాహ్మణోత్తముని ద్వారా ఇలా తెలియజేసుకుంటున్నది

iBAT తాత్పర్యము

స్వామీ! కృష్ణా! పంకజనాభా! పురుషోత్తమా! నా గుండెలోని అలజడి ఇట్టిది అట్టిది అని నేను చెప్పగలిగింది కాదు. కాబట్టి అడ్డుచెప్పకు. రేపే రథాలూ, గజాలూ, గుఱ్ఱాలూ, కాల్బంటులూ గల గొప్ప సేనావాహినితో బయలుదేరు. మొట్టమొదటగా శిశుపాలుణ్ణీ, వానికి అండగా నిలిచిన జరాసంధుణ్ణీ జయించు. తరువాత నా దగ్గరకు వచ్చి, నీ పరాక్రమమే కన్యకు ఇచ్చే సొమ్ముగా చేసి రాక్షస వివాహ పద్ధతిలో నన్ను చెట్ట బట్టి తీసుకొనిపో. నేను వస్తాను
10-1711 ప్రాణేశ నీ మంజుభాషలు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?

(ఆటవెలది)

నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు చేయని
జన్మ మేల? యెన్ని జన్మములకు.

iBAT సందర్భం

రుక్మిణి విప్రవరుని ద్వారా తన దృఢనిశ్చయాన్ని శ్రీకృష్ణవాసుదేవునకు తెలుపుకొంటున్నది. తన అయిదు జ్ఞానేంద్రియాలు స్వామికి సమర్పణగా చేసికొన్న విషయాన్ని మరొకవిధంగా వెల్లడిస్తున్నది.

iBAT తాత్పర్యము

నీవు నా ప్రాణాలకు ప్రభువువు. నీ మధురమైన మాటలు వినలేకపోతే నాకు చెవులుండటమే ప్రయోజనం లేని విషయం. పురుషోత్తమా! నీకు భోగ్యం కాని నా తనులత అందచందాలు ఎందుకయ్యా! భువనమోహనా! నిన్ను చూడలేని కన్నులు ఉండి ఏమి ఊడి ఏమి? ప్రియా! నీ అధరామృతం ఆనలేని జిహ్వకు ఎంత ఫలరసం అందినా అది వ్యర్థమే. విప్పారిన పద్మాలవంటి కన్నులున్న స్వామీ! నీవు ధరించిన వనమాలిక పరిమళాన్ని అందుకోలేని నాసికకు సార్థకత ఉంటుందా? ధన్యచరితా! నీకు దాస్యం చేయని బ్రతుకు ఎందుకు? ఎన్ని జన్మలైనా వ్యర్థమే.
10-1717 వచ్చెద విదర్భభూమికిఁ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వచ్చెద విదర్భభూమికిఁ;
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్.

iBAT సందర్భం

విప్రవరుని ద్వారా విదర్భరాజతనయ సందేశం వీనులారా విన్నాడు శ్రీ కృష్ణస్వామి. ఆ మహాత్ముని చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. ఆనందంతో తనకు ఆమె యందు గల అనురాగాన్ని ముక్తసరిగా మూడు మాటలతో చెబుతూ తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు

iBAT తాత్పర్యము

బ్రాహ్మణప్రవరా! నేను విదర్బ దేశానికి వస్తాను. భీష్మకుని పురం ప్రవేశిస్తాను. చూడముచ్చట అయిన విలాసంతో ఆ బాలను తెచ్చుకుంటాను. పగవారు అడ్డం వస్తే వారినందరినీ క్షణకాలంలో చీల్చి చెండాడుతాను.
10-1727 ఘను డా భూసురు డేగెనో... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఘనుఁ డా భూసురు డేఁగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?
విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలపఁడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?

iBAT సందర్భం

రుక్మిణికి మదిమదిలో లేదు. ముహూర్తం దగ్గరపడుతున్నది. శిశుపాలుడు మొదలైన వారంతా వచ్చి కూర్చున్నారు. కృష్ణుడు వస్తాడో, రాడో! తనను గూర్చి ఏమనుకుంటున్నాడో అని ఆమె హృదయం అదవదలయిపోతున్నది. ఇలా అనుకుంటున్నది

iBAT తాత్పర్యము

ఆ మహాత్ముడు బ్రాహ్మణుడు కృష్ణుని దగ్గరకు వెళ్ళాడో లేదో? మధ్యలో మార్గాయాసంతో ఎక్కడైనా చిక్కబడ్డాడేమో? నా విన్నపం విని శ్రీకృష్ణుడు తప్పుగా తలపోయలేదు కదా? ఒకవేళ ఇక్కడకు వచ్చి ఉన్నాడేమో? పరమేశ్వరుడు నా విషయంలో అనుకూలంగా ఉండాలనుకున్నాడో లేదో? అమ్మలగన్నయమ్మ ఆ ఉమాపరమేశ్వరి నన్ను రక్షించటానికి పూనుకున్నదో లేదో? ఇంతకూ నా భాగ్యం ఎలా ఉన్నదో?
10-1730 చెప్పదు తల్లికిం... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికన్
గప్పదు; వక్త్రతామరస గంధ సమాగత భృంగసంఘమున్
రొప్పదు; నిద్రఁ గైకొన; దురోజ పరస్పరసక్త హారముల్
విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్.

iBAT సందర్భం

శ్రీకృష్ణుని రాక సూచనలు లేక రుక్మిణి మూడు కరణాలూ ముప్పుతిప్పలు పడుతున్నాయి. అనేక ఆలోచనల అలలు హృదయంలో చెలరేగుతున్నాయి. ఎవరికి చెప్పుకొని కొంతకు కొంతైనా ఆరాటాన్ని ఆపుకోవాలో అర్థం కావటం లేదు. ఆ స్థితిలో ఆమె అవస్థ ఎలా ఉన్నదో పోతన మహాకవి ఇలా వక్కాణిస్తున్నాడు

iBAT తాత్పర్యము

తన ఎదలోని ఆరాటాన్ని ఎవరైనా ఆత్మీయులకు చెప్పుకొంటే కొంత శాంతత ఏర్పడుతుంది. బిడ్డకు అమ్మకంటే ఆత్మీయ ఎవరు? అటువంటి కన్నతల్లికి కూడా తన ఆరాటాన్ని చెప్పుకోలేకుండా ఉన్నది రుక్మిణి. చిరునగవు అనే వెన్నెలతో దిక్కులను కూడా క్రప్పటం లేదు. మోము తామర పరిమళానికి పరవశించి మూగుతున్న తుమ్మెదలను తోలాలనే ఊహ కూడా ఆమెకు కలుగలేదు. నిద్ర అసలే లేదు. వక్షఃస్థలం మీది హారాలన్నీ అటూఇటూ పొరలటం వలన ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయాయి. వానిని చిక్కు కూడా తీయాలనిపించటం లేదు ఆమెకు. తన మనోహరుడు కృష్ణుడు వచ్చే దారినుండి చూపుల పంక్తులను కొంచెం కూడా త్రిప్పటంలేదు.
10-1740 తగు నీ చక్రి... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా; దర్పాహతారాతి యై
మగఁ డౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్.

iBAT సందర్భం

రుక్మిణి తపస్సు ఫలించిందని తిరిగివచ్చిన విప్రప్రవరుడు తెలియజేశాడు. బల రామకృష్ణులకు భీష్మకుడు విడుదులేర్పాటు చేశాడు. క్షణంలో హరిరాక వార్త విదర్భ ప్రజల వీనులకు విందుచేసింది. శ్రీకృష్ణదేవుని సుందరవదనారవిందాన్ని వీక్షించి పౌరజనాలు ఇలా అనుకున్నారు

iBAT తాత్పర్యము

అదిగో చక్రం చేతిలో ధరించి విలాసంగా విచ్చేస్తున్న శ్రీకృష్ణుడు, మా ఏలిక కన్నబిడ్డకు ఇతడే తగిన భర్త. అంతేకాదు. ఆ చక్రికి కూడా ఈమెయే అన్నివిధాలా యోగ్య అయిన ఇల్లాలు. ఇది ముమ్మాటికీ సత్యం. ఈ దాంపత్యం ఇంత గొప్పదై విరాజిల్లటం చాలా గొప్పసంగతి. ఈ యిద్దరినీ ఒకరికొకరిని ఏర్పాటుచేసిన బ్రహ్మ గొప్పనేర్పుకాడు. మా పుణ్యాలు మూలకారణంగా, యీ చక్రి, పొగరుబోతులైన పగవారి నందరినీ పరిమార్చి మా రాజకుమారికి మగడు అగుగాక
10-1744 నమ్మితి నా మనంబున.. (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ సేయు మమ్మ! నిన్
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!

iBAT సందర్భం

కృష్ణస్వామి వచ్చిన సంగతి తెలుసుకొన్న రుక్మిణి హృదయం తేటపడింది. కులాచారం ప్రకారం గౌరీపూజ నాచరించటానికి అమ్మవారి ఆలయంలోనికి ప్రవేశించింది. ముగ్గురమ్మల మూలపుటమ్మకు ముచ్చటగా రుక్మిణిచేత విప్రుల యిల్లాండ్రు పూజ చేయించారు. రుక్మిణి మనస్సులో ఇలా అనుకొంటున్నది

iBAT తాత్పర్యము

నేను నా మనస్సులో సనాతనులైన ఉమామహేశ్వరులను నమ్ముకొన్నాను. మీరు పురాణదంపతులు, కనుక పరమేశ్వరీ! నీవు మేటి పెద్దమ్మవు. సముద్రమంత దయ నీది. నాకు శ్రీహరిని పతిగా అనుగ్రహించు తల్లీ! నిన్ను నమ్మినవారికి ఎన్నటికీ నాశము లేదు గదమ్మా!
10-1750 కనియెన్ రుక్మిణి.. (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖుం, గంఠీరవేం ద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతర వక్షున్, మేఘసంకాశ దే
హు, నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిన్, బీతాంబరున్,
ఘన భూషాన్వితుఁ, గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.

iBAT సందర్భం

శ్రీరుక్మిణీమహాదేవి స్వయంవర మండపం లోనికి ప్రవేశించింది. మెల్లగా అడుగులు వేస్తూ రాజుల సముదాయాన్ని దాటుకొంటూ ముందునకు సాగుతున్నది. తక్కిన రాజులెవ్వరూ ఆమె కంటికి ఆనటంలేదు. అల్లంతదూరాన తన ప్రాణేశ్వరుడు కన్నులలో కదలాడుతున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ స్వామి పూర్ణచంద్రునివంటి మోముతో అలరారుతున్నాడు. సింహం నడుము వంటి నడుముతో విరాజిల్లుతున్నాడు. అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మాలవంటి కన్నులతో అందాలు విరజిమ్ముతున్నాడు. దేహమంతా నీలమేఘంలాగా శ్యామలవర్ణంతో ఒప్పారు తున్నది. దేవేంద్రుని ఏనుగు ఐరావతం తొండంవంటి బాహువులు చూపులను ఆకట్టు కొంటున్నాయి. చేతబట్టిన చక్రం కాంతిచక్రాలను కమనీయంగా వెలువరిస్తున్నది. పసిమి వన్నె పట్టుబట్ట వెలుగులు అలరిస్తున్నాయి. నిలువెల్లా విలువకట్టనలవి కాని అలంకారాలు కాంతి వలయాలకు ఆకరాలవుతున్నాయి. అదిగో కమనీయశంఖం వంటి కంఠం అందరినీ ఆకర్షిస్తున్నది. రుక్మిణిని గెలుచుకోవాలి అనే ఉత్కంఠ ముఖంలో స్పష్టంగా తెలియ వస్తున్నది. జగత్తులన్నింటినీ మోహపారవశ్యంలో ముంచుతున్న నందనందన సుందరుడైన శ్రీకృష్ణుణ్ణి శ్రీ రుక్మిణి తిలకించింది
10-1784 ధ్రువకీర్తిన్ హరి.. (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.

iBAT సందర్భం

బ్రహ్మండానికంతటికీ బ్రహ్మానందాన్ని సంధానించే రుక్మిణీ వాసుదేవుల దివ్య కల్యాణ వైభవాన్ని భావించటం పరమపుణ్యం. తెలుగుల పుణ్యపేటి పోతనామాత్యులవారు ఆ మహా భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నారు.

iBAT తాత్పర్యము

ఆయన హరి. సర్వప్రాణులనూ తనలోకి హరింపజేసుకొనే మహాత్ముడు. ఆమె రుక్మిణి. తన ఒడలంతా సువర్ణమయమే అయిన ఉత్తమ వనిత. ఆమె తన హృదయాన్ని కొల్లగొట్టింది. అభిమానము, వైభవము, గాంభీర్యమూ అనే మహాలక్షణాలతో విహరిస్తున్నది. అందరకూ, అన్నింటికీ సంపదలను సమకూర్చే సౌభాగ్యంతో విరాజిల్లుతున్నది. సజ్జనులను దగ్గరి చుట్టాలుగా భావించి సత్కరించే సౌజన్యంతో ఒప్పారే దివ్యలక్షణం కలది. పుణ్యకార్యములందు మాత్రమే ప్రవృత్తి కలిగినట్టిది. లేమి అనే దెయ్యాన్ని రూపుమాపే శీలం కలది. జాజ్వల్యమానములైన ఆభరణాలతో, అత్యద్భుతంగా వెలుగులు చిమ్ముతున్న వస్త్రాలతో అలరారుతున్నది. గుణవతులైన వనితల తలమానికమై ప్రకాశిస్తున్నది. అటువంటి ధృవమైన కీర్తి గల రుక్మిణీదేవిని ఆ శ్రీహరి పెండ్లియాడినాడు

దశమ స్కంధం ఉత్తరభాగం

10-172 లేమా దనుజుల గెలువఁగ.. (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను; మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్

iBAT సందర్భం

శ్రీకృష్ణులవారు నరకాసురుణ్ణి సంహరించటానికి ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నారు. స్వామితోపాటు సత్రాజిత్తు తనయ సత్యభామ కూడా బయలుదేరింది. జగదేకజయ శీలుడు మురాసురాదులను పరిమార్చాడు. సత్యభామా జగన్నాథులకు నరకుడు ఎదురై నిలిచాడు. హఠాత్తుగా అమ్మవారు వానితో పోరాటానికి సిద్ధమైంది. అది చూచి శ్రీహరి ఇలా అంటున్నాడు

iBAT తాత్పర్యము

లేమా! ఈ రక్కసులను మేము గెలువలేమా! నీవెందుకు పూనుకొని విజృంభిస్తున్నావు. నా దగ్గరకు రా! లే! ఈ ప్రయత్నాన్ని మానుకో! మానుకోను అంటే ఇదిగో లేచి మా వింటిని లీలగా కేలితో అందుకో!
10-177 సౌవర్ణ కంకణ.. (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు; శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ ధగధగ దీప్తులు; గండమండల రుచి గప్పికొనఁగ
ధవళతరాపాంగ ధళధళ రోచులు; బాణజాలప్రభాపటలి నడఁప
శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంథి; సైనిక కలకల స్వనము లుడుప



వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట విడుచుట యేయు టెల్ల
నెఱుఁగరాకుండ నని చేసె నిందువదన.

iBAT సందర్భం

సత్యభామ సర్వేశ్వరుని అనుమతినీ, వింటినీ రెంటినీ అందుకొన్నది. కృష్ణదేవునకు ఆమె సంరంభం ఆనందసాంద్రస్థితిని కలిగిస్తున్నది. పగవానికి మాత్రం పరమరౌద్రంగా భాసిస్తున్నది. ఇది ఒక విచిత్రమైన రస సమ్మేళనం. అప్పటి ఆ తల్లి విజృంభణను పోతన కవీంద్రులు ఇలా అభివర్ణిస్తున్నారు

iBAT తాత్పర్యము

సత్యభామ ముంజేతివలయాల ఝణఝణ నాదం అల్లెత్రాటి గంభీరనాదం తో చెలిమి చేస్తున్నది. కర్ణాభరణాలలోని మణుల ధగధగ కాంతులను చెక్కిలి కాంతులు కప్పివేస్తున్నాయి. మిక్కిలి తెల్లని కడకంటి ధళధళలాడే దీప్తులు బాణాల పంక్తుల ప్రభలను అణచివేస్తున్నాయి. దూసుకొనిపోతున్న బాణాల భూత్కారధ్వనులు పగవాని సైనికుల కల కల ధ్వనులను రూపుమాపుతున్నాయి. వీరము, శృంగారము, భయానకము, రౌద్రము, అద్భుతము అనే అయిదురసాలు ఒక్కటిగానై ఈ భామినిగా అయినాయా అన్నట్లు ఆ హరిసుందరి అలరారుతున్నది. బాణం వింటిలో ఎప్పుడు సంధించిందో, ఎప్పుడు విడిచిందో, ఎప్పుడు కొట్టిందో ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఆ విధంగా ఆ ఇందు వదన యుద్ధక్రీడతో విహరించింది.
10-178 పరుఁ జూచున్.. (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగన్ జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచున్, జంద్రాస్య హేలాగతిన్.

iBAT సందర్భం

సత్యభామ చకచకా ఇటు తన ప్రాణనాయకుణ్ణీ, అటు నరకుణ్ణీ మార్చి మార్చి చూస్తూ ఘోరంగా పోరుతున్నది. లిప్తకూడా వ్యవధానం లేని ఆ చూపులలో, ఆ కదలికలలో రెండు విరుద్ధరసాలు వింతగా అనుభవానికి వస్తున్నాయి

iBAT తాత్పర్యము

ఆ భామ తీవ్రక్రోధంతో పగవానిని చంపివేయాలని చూస్తున్నది. వెంటనే చూపును ఇటువైపు త్రిప్పి తన పతిదేవుణ్ణి అదే చూపుతో ఆనందింపచేస్తున్నది. అటువైపు రోషం పెల్లుబుకుతున్నది. ఇటువైపు అనురాగం అంబరాన్ని అంటుకొంటున్నది. అటువైపు కనుబొమలు ముడివడుతున్నాయి. ఇటువైపు మందహాసం చిందులు త్రొక్కుతున్నది. అటు వీరరసమూ, ఇటు శృంగారరసమూ ఏకకాలంలో ఒప్పారుతున్నాయి. అటువైపు, కన్నులలో కెంపు, ఇటువైపు సొంపు తాండవిస్తున్నాయి. నిండు చందురుని చల్లని కాంతులు కదలాడుతున్న మోముతో అలరారే ఆ అంగన విలాసంగా, పగవానిమీద భయంకరమైన అస్త్రాలనూ, పతిదేవుని మీద సరసములైన చూపులనూ కుప్పలుతెప్పలుగా కురిపిస్తున్నది.
10-183 రాకేందుబింబ మై.. (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
రాకేందుబింబమై రవిబింబమై యొప్పు; నీరజాతేక్షణ నెమ్మొగంబు;
కందర్పకేతువై ఘన ధూమకేతువై; యలరుఁ బూఁబోఁణి చేలాంచలంబు;
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై; మెఱయు నాకృష్ట మై మెలఁత చాప;
మమృత ప్రవాహమై యనల సందోహమై; తనరారు నింతి సందర్శనంబు;

(తేటగీతి)

హర్ష దాయి యై మహారోష దాయి యై
పరఁగు ముద్దరాలి బాణవృష్టి;
హరికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల.

iBAT సందర్భం

శ్రీహరిని చెట్టపట్టిన శృంగార రసాధిదేవత సత్యభామ ఇప్పుడు క్రొత్తగా నరకుని నరికి పోగులు పెట్టటానికి వీరరసాధిదేవత అయ్యి పోరుతున్నది. ఇటు శృంగారలక్ష్మీ, అటు వీరలక్ష్మీ అయిన ఆయమ్మను అత్యద్భుతంగా మన మనఃపటం మీద అక్షరశిల్పం చేస్తున్నారు మహాకవి పోతనామాత్యులు

iBAT తాత్పర్యము

పద్మాలవంటి కన్నులతో విరాజిల్లుతున్న ఆ సత్యభామ నిండుమోము కృష్ణదేవునకు పూర్ణిమనాటి చంద్రబింబమై ఒప్పారుతున్నది. అటు నరకునకు భగభగమండే రవి బింబమై ఉడికిస్తున్నది. ఆమె చీరకొంగు కృష్ణునకు మన్మథుని పతాకయై భాసిస్తున్నది. నరకునకు అదే ఒక ప్రాణాంతకమైన తోకచుక్కగా తోస్తున్నది. చెవులదాకా లాగిన అల్లె త్రాటితో అలరారు ఆమె చేతిలోని విల్లు కృష్ణునకు మన్మథుని గుడి అయి ఆనంద మందిరం అయింది. అదే నరకునకు ప్రళయకాలంనాటి భాస్కరునికి ఏర్పడిన మండలంగా కన్పట్టింది. ఆ వనితను తేరిపారజూడటం హరికి అమృతప్రవాహం అయింది. నరకునకు అగ్నికుంపటిలా అయిపోయింది. ఆ ముద్దరాలి బాణాల జడివాన హరికి హర్షాన్నీ, అరికి మహారోషాన్ని అందజేస్తున్నది. ఇలా శృంగారవీరరసాలు వింతగా ఒక క్రమంలో విస్తరిల్లుతున్నాయి.
10-187 కొమ్మా దానవనాథుని.. (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కొమ్మా! దానవ నాథుని
కొమ్మాహవమునకుఁ దొలఁగె; గురువిజయముఁ గై
కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ
గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్.

iBAT సందర్భం

సత్యభామ సరభసంగా సాహసంతో పోరాడి రక్కసి మూకలను దిమ్మతిరిగేట్టు కొట్టింది. వారందరూ తోక ముడిచారు. అది చూచి హరి ఆ హరిణలోచనతో సరసంగా ఇలా పలికాడు

iBAT తాత్పర్యము

భామా! దానవుల నాథుడు అనాథుడయ్యాడు. ఆతని పరివారమంతా నీ ధాటికి నిలువలేక పలాయనం చిత్తగించారు. నీకు చాలా గొప్పవిజయం సిద్ధించింది. గ్రహించు. అంతే కాదు నేను కూడా మెచ్చాను. కోరిన అలంకారాలన్నింటినీ నీకు కానుకగా ఇస్తాను. తీసుకో.
10-212 వనజాక్షి నేఁగన్క.. (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వనజాక్షి! నేఁ గన్క వైజయంతిక నైన; గదిసి వ్రేలుదు గదా కంఠమందు;
బింబోష్ఠి! నేఁ గన్క బీతాంబరము నైన; మెఱసి యుండుదు గదా మేనునిండఁ;
గన్నియ! నేఁ గన్క గౌస్తుభమణి నైన; నొప్పు చూపుదుఁ గదా యురమునందు;
బాలిక! నేఁ గన్కఁ బాంచజన్యము నైన; మొనసి చొక్కుదుఁ గదా మోవిఁ గ్రోలి;



పద్మగంధి! నేను బర్హ దామమ నైనఁ
చిత్రరుచుల నుందు శిరమునందు
ననుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు
గములు గట్టి గరుడగమనుఁ జూచి.

iBAT సందర్భం

శ్రీకృష్ణవాసుదేవుడు నరకాసురుని సంహరించి అతని పురం ప్రవేశించి అక్కడ అతడు ఎక్కడెక్కడినుంచి తెచ్చియో బంధించి ఉంచిన పదనారువేల రాచకన్నియలను చెరనుంచి విడిపించాడు. వారందరూ శ్రీకృష్ణునిపై మోహం పెంచుకున్నారు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు.

iBAT తాత్పర్యము

ఆ నరకుని చెరనుండి విడుదలపొందిన పదునారువేల కన్నియలు నల్లనయ్య అందచందాలను చూచి పరవశించిపోయారు. ఇలా అనుకుంటున్నారు. వనజాక్షీ! నేనే వైజయంతీమాలనైతే ఆ స్వామి కంఠసీమలో మాలనై వ్రేలాడేదానను కదా! బింబోష్ఠీ! నేను పట్టుపుట్టాన్నైతే ఆ స్వామి మేనంతా ఆవరించి మెరసిపోయేదానను కదా! ఓ కన్నెపిల్లా! నేనే కనుక కౌస్తుభమణినై ఉంటే ఆ స్వామి ఉరఃస్థలంపై ఒప్పారి ఉండేదానను కదా! బాలికా! నేను పాంచజన్యాన్నయి ఉంటే ఆ దేవదేవుని మోవిని ఆస్వాదిస్తూ పారవశ్యం పొందేదానను కదా! పద్మగంధీ! నేను నెమలిపింఛమునై ఉంటే ఆ మహాత్ముని శిరస్సు మీద చిత్రకాంతులతో చెన్నారి ఉండే దానను. – అని పెక్కువిధాలుగా గుంపులు గుంపులుగా కూడుకొని గరుడగమనుని చూచి ఆడుకున్నారు.