iBam భాగవతం ఆణిముత్యాలు

షష్ఠ స్కంధం

6-12 ఎమ్మెలు చెప్పనేల... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎమ్మెలు సెప్పనేల? జగ మెన్నగ పన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని, భక్తిలో
నమ్మినవాని, భాగవత నైష్ఠికు డై తగువాని, పేర్మితో
బమ్మెర పోతరాజు కవిపట్టపురాజు దలంచి మ్రొక్కెదన్.

iBAT సందర్భం

తెలుగు భాగవతంలో ఆరవ స్కంధాన్ని ఏర్చూరి సింగయ రచించాడు. తనకు మార్గదర్శకుడైన బమ్మెరపోతన్న గారిని పరమభక్తితో ఇలా స్తుతిస్తున్నాడు సింగయ.

iBAT తాత్పర్యము

వినోదం మాటలు ఎందుకులెండి. ఉన్నమాట ఉన్నట్టు అంటాను అంటారు మా గురువు పోతన్నగారు. అందువలననే ఆదిశేషుని పడగలమీద పవ్వళించే పరమాత్మకు ఆభరణాలు అయ్యే తీరుతో వాక్యాలసంపదలు కొల్లలుగా నివేదించుకున్నారు. దానిని జగమంతా కొనియాడింది. పరమభక్తితో ఆ స్వామినే నమ్ముకొని జీవించారు. భగవంతుని కథలమీదా, భగవంతుని భక్తుల కథలమీదా పరమనిష్ఠగల భాగవతోత్తములు వారు. అట్టి కవిసార్వభౌముడని కొనియాడదగిన బమ్మెర పోతనగారిని స్మరిస్తూ మ్రొక్కులు చెల్లించుకుంటాను.
6-14 ఎయ్యది కర్మబంధముల... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు, విభూతికారణం
బెయ్యది, స న్మునీంద్రులకు నెల్ల గవిత్వసమాశ్రయంబు ము
న్నెయ్యది, సర్వమంత్రముల నేలిన దెయ్యది, మోక్షలక్ష్మిరూ
పెయ్యది, దానిఁ బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్.

iBAT సందర్భం

ఏర్చూరి సింగన బమ్మెర పోతనను భక్తితో ఉపాసించిన ఉత్తమకవి. ఆ ప్రభావంతో ఏర్పడిన సంస్కారబలంతో భాగవతం ఒక పరమమంత్రంగా సంభావించి దానిని పలుకుతానంటున్నాడు.

iBAT తాత్పర్యము

భాగవతం అంటే భగవంతునికి సంబంధించిన గుణగణాలను ప్రపంచించి చెప్పే ఒక మహామంత్రం. అది కర్మలవలన కలిగే బంధాలన్నింటినీ తొలగించివేస్తుంది. పొందదగిన గొప్పసంపదలన్నింటినీ భక్తులకు సిద్ధింపజేస్తుంది. నిత్యసత్యమైన పరతత్త్వాన్ని మాత్రమే పలకాలనే పట్టుదలగల మహర్షులు వాల్మీకికీ, వ్యాసుల వారికీ అత్యద్భుతమైన కవిత్వభిక్ష పెట్టింది. మంత్రాలన్నింటినీ ఏలిన మహామంత్రం అది. ఒక్కమాటలో చెప్పాలంటే అది అందరూ అందుకోవలసిన మోక్షలక్ష్మియే. భక్తుల హృదయాలలో భద్రంగా నెలకొని ఉండేది ఆ మంత్రమే. కనుక నేను దానినే వాక్కులతో ఉపాసిస్తాను.
6-23 భాగవతము తేటపఱుప... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
భాగవతము తేటపఱుప నెవ్వడు సాలు ?
శుకుడు దక్కనరుని సకుడు దక్క
బుద్ధి దోచినంత, బుధులచే విన్నంత,
భక్తి నిగిడినంత, పలుకువాడ

iBAT సందర్భం

భాగవతం మరొకరూపంలో మనకు దొరకిన వేదం. అది జ్ఞానదీపం. దానిని తెలిసి పలకటం తేలికైన పనికాదు. ఆ గౌరవాన్ని చక్కగా గమనించి పలుకుతున్నాను అంటున్నారు సింగయ్య కవి.

iBAT తాత్పర్యము

భాగవతం స్పష్టంగా తెలియజెప్పటానికి చాలినవారు ఇద్దరు మాత్రమే. ఒక మహాత్ముడు శుకయోగీంద్రుడు. రెండవవాడు సాక్షాత్తు పరమాత్మయే అయిన శ్రీకృష్ణవాసుదేవుడు. నాబుద్ధిని ప్రేరణచేసి స్వామి ఎంత అందిస్తాడో అంత పలుకుతాను. జ్ఞానసంపన్నులైన పండితులు చెప్పగా చెవులబడినంత పట్టుకొని పలుకుతాను. అన్నింటికంటె ముఖ్యమైనది భక్తి. అది ఎంతదూరం సాగితే అంత చెబుతాను
6-52 కొందఱు పుణ్యవర్తనులు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా
నంద మరందపాన కలనా రత షట్పదచిత్తు లౌచు, గో
వింద పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం
జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచుకై వడిన్.

iBAT సందర్భం

పరీక్షిత్తు శుకయోగీంద్రులను పాపపంకిలం నుండి బయటపడటం ఎలా అని ప్రశ్నచేశాడు. దానికి సమాధానంగా శుకులు ఇలా వివరిస్తున్నారు.

iBAT తాత్పర్యము

రాజా ! లోకంలో కొందరు సర్వకాలాలలో పుణ్యకార్యాలే చేస్తూ ఉంటారు. వారి నడవడి అంతా పవిత్రంగానే ఉంటుంది. వారు గోపకుమారుడున్నాడే! అదేనయ్యా కృష్ణయ్య! ఆయన పాదాలను పద్మాలుగా భావించి అందునుండి జాలువారే ఆనందం అనే మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ స్థితిలో వారి హృదయం తుమ్మెదవంటిదవుతుంది. ఆ విధంగా గోవిందుడే పరమగతి అన్నభావనలో నిశ్చలంగా ఉండే భక్తులు స్వచ్ఛమైన వేషం తాల్చి పాపాలను పటాపంచలు చేసుకుంటారు. వారి ఆత్మలలో చక్కగా కుదురుకొన్న భక్తిచేత, సూర్యుడు మంచును అణచివేసినట్లుగా, పాపాలను బాపుకుంటారు.
6-53 హరి భక్తి చేతఁ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరిభక్తి చేత కొందఱు
పరిమార్తురు మొదలు ముట్ట బాపంబుల ని
ష్ఠురతర కరముల సూర్యుం
డరుదుగ, బెనుమంచుపించ మణచినభంగిన్

iBAT సందర్భం

విష్ణుభక్తిని పెంపొందించుకుంటే పరమాత్మను చేరుకొనే దారిలోని అడ్డంకులన్నీ తొలగిపోవటాన్ని శ్రీ శుక యోగీంద్రులు పరీక్షిత్తునకు ఇలా తెలియజేస్తున్నారు.

iBAT తాత్పర్యము

మానవుని పట్టిపల్లార్చేవి పాపాలు. వానిని మూలముట్టుగా మట్టుపెట్టటం మానవునకు తప్పని కర్తవ్యం. ఆ పనిచేయకపోతే కలిగేది భ్రష్టతయే. సూర్యభగవానుడు తనతీవ్ర కిరణాలతో బాగా క్రమ్ముకొన్న మంచు పొగరు అణచివేయకపోతే మానవునకు దారి కానరాదు. సూర్యుడు మంచును చీల్చి వెలుగును ప్రసాదించినట్లుగా శ్రీవాసుదేవభక్తి పాపాలను సమూలంగా తొలగించివేస్తుంది. భగవద్దర్శనానికి అడ్డంగా ఉన్నతెర దానితో తొలగిపోతుంది.
6-58 సతతముఁ గృష్ణ పాద... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
సతతము కృష్ణ పాదజలజంబులయందు మనంబు నిల్పు సు
వ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని యుగ్రపాశ సం
హతుల ధరించు తత్సుభటవర్గములం గలలోన గానరే
గతులను దుష్టకర్మములు గైకొని వారల జెందనేర్చునే?

iBAT సందర్భం

శ్రీశుకయోగీంద్రులు పరీక్షిన్మహారాజునకు కృష్ణభక్తి వలన లభించే మహాఫలాన్ని మధురమైన మాటలతో ఇలా వివరిస్తున్నారు.

iBAT తాత్పర్యము

రాజా ! శ్రీకృష్ణుడు పరమాత్మ. నామరూపాలులేని పరమాత్మ లోకాలను అనుగ్రహించటం పనిగా శ్రీకృష్ణమూర్తియై భూమికి దిగివచ్చాడు. ఆయన పాదపద్మాలయందు నిరంతరం మనస్సును నిక్షేపించాలి. అలా చేసేవారిని ‘సువ్రతులు’ అంటారు. ఆ మహాత్ముడు మానవులను ఉద్ధరించటంకోసం భూమిపై సంచరించిన కాలంలో కొన్ని గుణాలను లీలలుగా ప్రకటించాడు. మనం అట్టి అతని శుద్ధగుణాలయందు చెదరని అనురాగం కలవారమైపోవాలి. అలా అయిన వారు భయంకర పాశాల దెబ్బలను వడ్డించే యమభటుల గుంపులను కలలో కూడా చూడరు. ఎటువంటి ఘోరమైన కర్మముల చేయగల అధికార పురుషులైనా కృష్ణభక్తుల దాపునకు ఏవిధంగానూ రాలేరు.
6-72 దూరమున నాడు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
దూరమున నాడు బాలుడు
బోరన దన చిత్తసీమ బొడగట్టిన నో
నారాయణ! నారాయణ! నారాయణ!
యనుచు నాత్మనందను నొడివెన్

iBAT సందర్భం

అజామీళుడు అనే ఒక పాపడు పాపాలపుట్ట. కన్యాకుబ్జంలో ఉండేవాడు. సంసార లంపటంలో మునిగి తేలుతూ ఎనభై ఎనిమిదేండ్ల జీవితం వ్యర్థం చేసుకున్నాడు. చివరికి పోగాలం దాపురించింది. యమభటులు ఎదురుగా హృదయం అదరిపోయేలా నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అతనికి తన కడగొట్టు ముద్దులపట్టి నారాయణుడు తలపులో మెదిలాడు.

iBAT తాత్పర్యము

తాను ముచ్చటపడి అతనితోడిదే బ్రతుకు అన్నట్లు కనిపెంచిన నారాయణ నామం గల కొడుకు దూరాన ఆడుకొంటున్నాడు. ఒకవంక యమభటులు తర్జిస్తూ గర్జిస్తూ ప్రాణాలను గుంజుకొనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అదృష్టవశాన నారాయణుడు గుర్తుకువచ్చాడు. అప్పుడా మహాపాతకశిరోమణి నారాయణా! నారాయణా! నారాయణా! అని మూడుమారులు గొంతెత్తి పిలిచాడు. కొడుకు నారాయణుడు పలికాడో లేదో కానీ పరమాత్మ అయిన నారాయణుడు అనుగ్రహించి పాపాలన్నీ పోగొట్టి అతనిని అక్కున చేర్చుకున్నాడు.
6-113 నెమ్మిఁ దొడలమీఁద... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
నెమ్మి తొడలమీద నిద్రించు చెలికాని
నమ్మదగినవాడు నయము విడిచి
ద్రోహబుద్ధి జంప దొడరునే? యెం దైన
బ్రీతి లేక ధర్మదూతలార !

iBAT సందర్భం

పాపాలపుట్ట అయిన అజామీళుని విషయంలో ధర్మదూతలకూ, భగవద్దూతలకూ పెద్ద వాగ్వాదం జరిగింది. భగవద్దూతలు ధర్ముని దూతలకు ఒక ధర్మసూక్ష్మాన్ని దృష్టాంత పూర్వకంగా బోధిస్తున్నారు.

iBAT తాత్పర్యము

ధర్మరాజభటులారా! ఒకడు ప్రేమతో ఒక చెలికానిని నిండుగా నమ్మి అతని తొడలమీద ఆదమరచి నిద్రపోతున్నాడు. రెండవవాడు నీతిమాలి ద్రోహబుద్ధితో ప్రీతితప్పి వానిని చంపటానికి పూనుకుంటాడా ఎక్కడైనా? అన్నారు విష్ణుభటులు. అజామీళుడు పాపాలన్నీ చేసినవాడే. కానీ అంత్యకాలంలో అసంకల్పితంగానయినా భగవన్నామాన్ని ఉచ్చరించాడు. అదే అతడు నమ్మి నెమ్మితో చెలికాని తొడలమీద నిద్రించటం. అట్టివానికి ద్రోహం చేయరాదని భగవద్దూతల అభిప్రాయం.
6-117 బ్రహ్మహత్యానేక... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనములు
గురుతల్ప కల్మషక్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు
తపనీయ చౌర్యసంతమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు
మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు

(తేటగీతి)

మహిత యాగోగ్ర నిత్యసమాధి విధుల
నలరు బ్రహ్మాది సురలకు నందరాని
భూరి నిర్వాణసామ్రాజ్యభోగభాగ్య
ఖేలనంబులు హరినామ కీర్తనములు

iBAT సందర్భం

హరినామ సంకీర్తనం అత్యద్భుతమైన ఫలాలను ప్రసాదిస్తుంది. కీర్తన చేసేవాని పాపాల చిట్టాలను చూడవలసిన అవసరం దానికి లేదు. అని నిరూపిస్తున్నారు అజామీళుని తీసుకొనిపోవటానికి వచ్చిన యమభటులతో విష్ణుభక్తులు.

iBAT తాత్పర్యము

యమభటులారా! ఈవిషయం మీరు సరిగా తెలుసుకోండి. బ్రహ్మహత్య మొదలైన ఘోరపాపాలనే కారడవులను కాల్చిపారవేసే అగ్మిజ్వాలలు హరినామ కీర్తనలు. తల్లులే అయిన గురుపత్నులను కామదృష్టితో చూచే పాపాత్ములనే విషసర్పాలకు నెమళ్ళు హరినామ కీర్తనములు. బంగారాన్ని దొంగిలించటం అనే కాఱుచీకటికి సూర్య కిరణాలు శ్రీహరి కీర్తనలు. మద్యపానం అనే పాపం ఒక మదించిన ఏనుగులమంద అయితే దానికి సింహాలు అవుతాయి శ్రీహరినామ కీర్తనలు. మహాయోగవిద్యను అతి కఠిన నియమాలతో అలవరచుకొని నిత్యసమాధి విధులతో ఆనందమందే బ్రహ్మ మొదలైన దేవతలు కూడా అందుకోలేని మోక్షసామ్రాజ్య భోగభాగ్యాలతోడి క్రీడలు హరినామ సంకీర్తనలు.
6-119 కామంబు పుణ్యమార్గ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కామంబు, పుణ్యమార్గ,
స్థేమంబు, మునీంద్ర సాంద్ర చేతస్సరసీ
ధామంబు, జిష్ణు నిర్మల
నామంబు దలంచువాడు నాథుడు గాడే?

iBAT సందర్భం

నామజపం మహాపుణ్యప్రదం. విష్ణుభక్తులు యమభటులకు దానిని చక్కగా వివరిస్తున్నారు. అజామీళోపాఖ్యానం లోని ఒక అద్భుతమైన పద్యం ఇది.

iBAT తాత్పర్యము

యమభటులారా! శ్రీమహావిష్ణువునకు ‘జిష్ణుడు’ అని కూడా వ్యవహారం ఉన్నది. అంటే సర్వలోకాలలో సర్వదేశాలలో జయించటమే ఆయన శీలం. అట్టి మహాత్ముని మచ్చలేని నామాన్ని జపించటం అందరికీ కోరదగిన విషయం. జపంచేసేవానిని పుణ్యాల మార్గంనుండి జారిపోకుండా నిలుపుతుంది. మహర్షివరేణ్యులందరూ తమ హృదయాలనే సరస్సులను ఆ నామమునకు దేవాలయంగా నిర్మించుకుంటారు. అట్టి నామాన్ని గట్టిగా భావించే పుణ్యాత్ముడు ‘స్వామి’ కాకుండా పోతాడా?
6-121 బిడ్డపేరు పెట్టి పిలుచుట... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
బిడ్డపేరు పెట్టి పిలుచుట, విశ్రామ
కేళి నైన, మిగుల గేలి నైన,
పద్య గద్య గీత భావార్ధముల నైన
కమలనయను తలప కలుషహరము

iBAT సందర్భం

భగవంతుని నామాన్ని ఏ విధంగా పలికినా పాపాలు పారిపోతాయి అని యమభటులకు విష్ణుభక్తులు వివరిస్తున్నారు.

iBAT తాత్పర్యము

అయ్యా ! యమభటులారా! కొడుకునకు స్వామి పేరుపెట్టుకొని పిలవటమూ, తీరిక సమయాలలో ఆటలాడుకొంటూ కానీ, వేళాకోళానికి కానీ, పద్యాలలో, గద్యాలలో, పాటలలో, కూనిరాగాలలో కానీ, కమలాక్షుణ్ణి స్మరించటమూ పాపాలను రూపుమాపి వేస్తుంది. కాగా నిష్ఠతో చేసే జపము మొదలైన వాని ఫలం ఏ ఎత్తులో ఉంటుందో ఎవరు చెప్పగలరు ?
6-123 అతిపాపములకుఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అతిపాపములకు ప్రయత్నపూర్వకముగ తనుపాపములకు మితంబుగాగ
సన్ముని వరులచే సంప్రోక్తమై యుండు నిర్మలం బగు పాప నిష్కృతములు
క్రమరూపమున నుపశమనంబు లగు గాని తత్ క్షణంబున నవి దరువలేవు
సర్వకర్మంబుల సంహార మొనరించి చిత్తంబునకు తత్త్వ సిద్ధి నొసగు

(తేటగీతి)

ఒనర నీశుసేవ, యోగి మానస సరో
వాసుసేవ హేమవాసుసేవ,
వేదవేద్యుసేవ, వేదాంతవిభుసేవ
పరమపురుష పాదపద్మసేవ.

iBAT సందర్భం

విష్ణుదూతలు యమదూతలకు పాపాల స్వభావాలను, వాని పరిహారాలను, వానికి సంబంధించిన విశేషాలను బోధిస్తున్నారు. పరమపురుష పాదపద్మ సేవవలన కలిగే సిద్ధిని కూడా తెలుపుతున్నారు.

iBAT తాత్పర్యము

యమభటులారా! అతిఘోరమైన మహాపాతకాలు బ్రహ్మహత్య మొదలైనవి ఉంటాయి. దానికి ఎంతో ప్రయత్నం చేసి గానీ, ప్రాయశ్చిత్తం చేసుకోలేము. చిన్నిచిన్ని పాపాలకు కొద్దిపాటి ప్రాయశ్చిత్తాలుంటాయి. ఈ అన్నింటినీ మహర్షులు లోకానికి చక్కగా చెప్పి ఉన్నారు. వాని నాచరించి పాపాలను పోగొట్టుకొని మానవులు నిర్మలమానసులు కావాలి. అలా కావటం హఠాత్తుగా జరిగేపనికాదు. క్రమక్రమంగా, కాలం గడచినమీదట ఆ పాపాలు ఉపశమనం పొందుతాయి. కానీ యోగిహృదయపద్మాలే ఆలయం అయిన వాడూ, పట్టుపుట్టాలు కట్టేమహాస్వామీ, వేదాలముఖంగానే తెలియదగిన ఆత్మస్వరూపుడూ, వేదాంతాలకు ప్రవర్తకుడూ, పరమపురుషుడూ అయిన వాసుదేవుని పాదసేవమాత్రం, అన్ని కర్మలనూ, వాని ఫలాలనూ అప్పటికప్పుడు రూపుమాపి చిత్తానికి తత్త్వసిద్ధిని కలిగిస్తుంది.
6-152 హరిభక్తులతో మాటలు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరిభక్తులతో మాటలు
ధర నెన్నడు జెడని పుణ్యధనముల మూటల్
వర ముక్తికాంత తేటలు
నరిషడ్వర్గంబు చొరని యరుదగు కోటల్

iBAT సందర్భం

అజామీళుని యమలోకానికి ఈడ్చుకుపోవటానికి వచ్చిన యమభటులు విష్ణు భక్తుల విమలవిచార వివేక వాక్యాలకు విస్మయం పొంది తమదారిని తాము వెళ్ళి పోయారు. అజామీళుడు వారి సంవాదమంతా విన్నాడు. తీవ్రమైన పశ్చాత్తాపంతో గాఢ మైన పరితాపం పొందాడు. అతని హృదయంలో వైష్ణవ జ్ఞానదీపం చక్కగా వెలుగొందింది. ఇలా అనుకుంటున్నాడు.

iBAT తాత్పర్యము

శ్రీ మహావిష్ణువునందు చెదరని భక్తిగల మహాత్ముల మాటలు పుణ్యధనాల మూటలు. వానికి భూమిలో ఎన్నటికీ చేటు ఉండదు. అవి ఎన్నిజన్మలకోగానీ అందుకోరాని మోక్షలక్ష్మి అనుగ్రహించే ప్రసన్నతలు. మనలోనే దొంగలవలె దూరి మన కొంపే ముంచే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే ఆరుగురు పగవారికి ఆవంతైనా అవకాశం ఇవ్వని అత్యద్భుతమైన కోటలు.
6-158 కోరినవారల కెల్లను... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కోరినవారల కెల్లను
జేరువ కైవల్యపదము, సిరివరుని మదిం
గోరనివారల కెల్లను
దూరము మోక్షాప్తి యెన్నిత్రోవల నైనన్

iBAT సందర్భం

పరమనికృష్టమైన బ్రతుకు బ్రతికి యమభటుల చిత్రహింసలకు గురికాబోయే పాపాత్ముడు అజామీళుడు మాటవరుసకు ‘నారాయణా’ అంటే వివేకవిజ్ఞానాలు కలిగి సద్యోముక్తి పొందాడు. ఇక సహజంగా సద్భక్తితో స్వామిని స్మరిస్తే దానిఫలం ఎట్టిదని చెప్పాలి అంటున్నారు శ్రీ శుక మహర్షి..

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా! శ్రియఃపతి అయిన శ్రీనివాసుని బుద్ధిపూర్వకంగా సేవించేకోరిక ఉన్నవారికి కైవల్యపదం చేరువలోనే సిద్ధిస్తుంది. చావుపుట్టుకల చక్రంలో సుఖంలేకుండా తిరుగుతూ ఉండటమే సంసారం. దానినుండి భగవదనుగ్రహం వలన బయటపడటమే కైవల్యం. అది కావాలి అనే కాంక్షలేనివారికి ఎన్ని పోకలుపోయినా మోక్షలాభం దూరమే అవుతుంది. అట్టివారికి వద్దనుకొనే దుఃఖం వద్దకు వస్తూనే ఉంటుంది.
6-171 అభవు నమేయు... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
అభవు, నమేయు, నవ్యయు, ననంతు, ననారతు పూని మేనిలో
నుభయము నై వెలుంగు పురుషోత్తము గానరు చిత్త కర్మ వా
గ్విభవ గరిష్టు లై వెదకి వీఱిడి ప్రాణులు; సర్వవస్తువుల్
శుభగతి జూడనేర్చి తను జూడగనేరని కంటిపోలికన్

iBAT సందర్భం

యమభటులు అజామీళుని విషయంలో అవమానంపొంది తమ ప్రభువు దగ్గరకు పోయి తమపాట్లు తెలుపుకున్నారు. స్వామీ! ఈ సృష్టిలో నీకంటె మించిన శాసకుడు మరొకడు ఉన్నాడా? అని అడిగారు. అప్పుడు యమధర్మరాజు శ్రీమహావిష్ణువును హృదయంలో నిలుపుకొని ఆయన మహామహిమను తన భటులకు ఇలా హృద్యంగా బోధించాడు.

iBAT తాత్పర్యము

భటులారా! శ్రీమహావిష్ణువు పుట్టుకలేనివాడు. ఏ ఊహలకూ అంతనివాడు. దేశ కాలాదులు తెచ్చే ఎట్టిమార్పులకూ లోబడకుండా ఏకమైన ఆకృతితో ఉంటాడు. తుదీ, మొదలూ లేనివాడు. అనారతుడు. అంటే ఎక్కడా, ఎప్పుడూ తెరపిలేనివాడు. ఉండటమే తప్ప మఱియొక స్థితిలేనివాడు. అట్టివాడు మనదేహంలో కర్మఫలాలు అనుభవించే జీవుడుగా, సాక్షిమాత్రంగా నిలిచివుండే దేవుడుగా రెండు విధాలుగానూ ఉన్నాడు. అందు వలననే ఆయనను పురుషోత్తముడంటారు. కానీ జీవులు ఆయనను చూడలేరు. మనస్సుతో, చేష్టతో, మాటతో శక్తిని పుష్కలంగా సంపాదించుకొని వెదకి కూడా విసిగివేసారిపోతారు కానీ తెలుసుకోలేరు. ఇది ఎటువంటిదంటే కన్ను చక్కనిచూపుతో సర్వవస్తువులను చూస్తుంది కానీ తన్నుతాను చూచుకోలేదుగదా
6-177 వర మహాద్భుత... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వర మహాద్భుతమైన వైష్ణవజ్ఞానంబు తిరముగా నెవ్వరు తెలియగలరు?
దేవాదిదేవుండు త్రిపురసంహరు డొందె, కమలసంభవు డొండె, కార్తి కేయ
కపిల నారదు లొండె, గంగాత్మజుం డొండె, మను వొండె, బలి యొండె, జనకు డొండె
ప్రహ్లాదు డొండె, నేర్పాటుగా శుకు డొండె, భాసురతరమతి వ్యాసు డొండె

(తేటగీతి)

కాక యన్యులతరమె? యీలోకమందు
నీ సుబోధంబు సద్బోధ మీ పదార్ధ
మీ సదానంద చిన్మయ మీయగమ్య
మీవిశుద్ధంబు గుహ్యంబు నీశుభంబు

iBAT సందర్భం

యమధర్మరాజు తన దూతలకు శ్రీమహావిష్ణుతత్త్వం తెలుసుకోవటం సులభంకాదనీ మహాజ్ఞాన సంపన్నులైన కొందరు మాత్రమే ఆ యెఱుక కలవారనీ బోధిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

అది చాలా గొప్పది. అద్భుతమైనది. అటువంటి విష్ణుసంబంధమైన జ్ఞానాన్ని చెదరిపోకుండా హృదయంలో నిలుపుకోగలవారు కొందఱు మాత్రమే ఉన్నారు. అందులో మొట్టమొదటగా చెప్పుకోవలసినవాడు దేవతలకు కూడా ఆదిదేవుడైన పరమేశ్వరుడు. ఆయన త్రిపురాసురులను సంహరించినవాడు. అటు పిమ్మట చెప్పుకోదగినవాడు విష్ణువు నాభిలో వెలుగొందుతున్న కమలంనుండి పుట్టిన నాలుగుమోముల దేవర. ఆ తరువాత చెప్పుకోదగినవాడు కుమార స్వామి. ఆయన ఆరుమొగాల అద్భుతదైవం. అటు పిమ్మట వచ్చేవారు కపిలమహర్షి, నారద మహర్షి, ఇంక భూమికి దిగివస్తే గంగ కొడుకు భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనక మహారాజు, ప్రహ్లాదుడు, శుకుడూ, వ్యాసులవారూ. ఈ పన్నెండుగురకు తప్ప విష్ణు సంబంధమైన జ్ఞానం ఇతరులకు తెలియదు. ఇది చక్కని తెలివి. చక్కని ఉపదేశం. మంచి వస్తువు. ఇది సదానందం. జ్ఞాన మయమైనది. ఒకపట్టాన పొందనలవి కానిది. పరమశుద్ధమైనది. గొప్పరహస్యం. మంగళకరం.
6-178 ఈ పన్నిద్దఱు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఈ పన్నిద్దఱు తక్కగ
నోపరు త క్కొరులు తెలియ నుపనిష దుచిత
శ్రీ పతినామ మహాద్భుత
దీపిత భాగవతధర్మ దివ్యక్రమమున్.

iBAT సందర్భం

భావం దృఢంగా కుదురుకోవటానికి యమధర్మరాజు ఆ విషయాన్నే మళ్ళీ బోధిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఇది పరమాత్మజ్ఞానాన్ని ప్రసన్నంగా మూలముట్టుగా బోధించే ఉపనిషత్తులలో నెలకొన్న తత్త్వం. లక్ష్మీనాధుని నామజపానికి సంబంధించిన మహాద్భుతమైనదీ, ప్రకాశించేదీ అయిన భాగవత ధర్మపు దివ్యక్రమం. దీనిని పరమశివుడు, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనకమహారాజు, ప్రహ్లాదుడు, శుకుడు, వ్యాసుడు అనే పన్నెండుగురు తప్ప ఇతరులు తెలియజాలరు.
6-179 ఏది జపియింప... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏది జపియింప నమృత మై యెసగుచుండు
నేది సద్ధర్మపథ మని యెఱుగ దగిన
దదియె సద్భక్తి యోగంబు నలవరించు
మూర్తిమంతంబు దా హరికీర్తనంబు

iBAT సందర్భం

యముడు తన దూతలకు హరికీర్తనమును గురించి యింకా ఇలా తెలియ జేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

హరినామాన్ని జపిస్తే అది అమృతమై విరాజిల్లుతుంది. పరమాత్ముని ధర్మమార్గం ఇదే అని తెలియదగినది హరికీర్తనయే. అదే సద్భక్తి యోగాన్ని అలవాటు చేస్తుంది. అది భక్తియోగానికి ఏర్పడిన ఆకారం.
6-186 శ్రుత్యంత విశ్రాంత... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రుత్యంత విశ్రాంత మత్యనుక్రమణీయ భగవత్ప్రసంగతుల్ భాగవతులు
సనకాదిముని యోగిజన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు
కృష్ణపద ధ్యాన కేవలామృతపాన పరిణామ యుతులు శ్రీభాగవతులు
బహుపాత కానీక పరిభవ ప్రక్రియా పరుషోగ్ర మూర్తులు భాగవతులు

(తేటగీతి)

భావతత్త్వార్థవేదులు భాగవతులు
బ్రహ్మవాదానువాదులు భాగవతులు
సిరులు దనరంగ నెన్నడు చేటులేని
పదవి నొప్పారువారు వో భాగవతులు

iBAT సందర్భం

యమధర్మరాజు తన భటులకు భగవంతునియందు నిండుగా భక్తి ఉన్నవారి గొప్పతనాన్ని చాలా గొప్పగా అభివర్ణిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఉపనిషత్తులు భగవత్తత్త్వాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి. భాగవతుల ప్రసంగాలు ఉపనిషద్ జ్ఞానాన్ని అనుసరించి మాత్రమే వెలుగొందుతూ ఉంటాయి. జ్ఞానమూర్తులైన సనకుడు మొదలైన మునులూ, యోగిజనులూ పొందే సదానంద పరమ భాగ్యమై ఒప్పారే మహాత్ములు భాగవతులు. శ్రీకృష్ణుని పాదాల ధ్యానం అనే సాటిలేని అమృతాన్ని త్రావటంచేత పాకానికివచ్చిన అంతరంగం కలవారు భాగవతులు. పెక్కు విధాలైన పాతకాల సేనలకు పరాభవం చేయటంలో అతికఠినమైన ఆకృతులు కలవారు భాగవతులు. పరమాత్మతత్త్వాన్ని బాగుగా తెలిసినవారు భాగవతులు. బ్రహ్మమును గూర్చిన పలుకులను అనుసరించి పలికేవారు భాగవతులు. ఐశ్వర్యం అంబరమంటి, ఎప్పుడూ చేటులేని స్థానాలలో ప్రకాశించేవారు భాగవతులు.
6-188 ఎకసక్కెమున కైన... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎకసక్కెమునకైన నిందిరారమణుని బలుకంగలేని దుర్భాషితులను
కలలోన నైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ సూడని కర్మరతుల
నవ్వుచునైన కృష్ణప్రశంసకు చెవి దార్పనేరని దుష్కథా ప్రవణుల
యాత్రోత్సవంబుల నైన నీశుని గుడిత్రోవ ద్రొక్కగలేని దుష్పదులను

(ఆటవెలది)

పరమభాగవతుల పాదధూళి సమస్త
తీర్థసారమనుచు తెలియలేని
వారి వారివారి వారిజేరినవారి
తొలుత గట్టి తెండు దూతలార

iBAT సందర్భం

యమదూతలకు యమధర్మరాజు విష్ణుభక్తిలేని వారిని తీసుకొనిరావలసినదిగా ఆజ్ఞాపిస్తున్నాడు. అజామీళుని అద్భుతగాథలోని పద్యం ఇది.

iBAT తాత్పర్యము

యమదూతలారా! వేళాకోళానికైనా ఇందిరారమణుని పేరు పలుకలేని పాడుకూతలవారినీ, కలలోనైనా శ్రీపతి శ్రీపాదకమలాలను చూడని దుష్టచేష్టల వారినీ, నవ్వులాటలోనైనా శ్రీకృష్ణుని ప్రశంసకు చెవులొగ్గని పాడుకథల పాండిత్యం కలవారినీ, యాత్రలో జరిగే పండుగలలోనైనా పరమేశ్వరుని ఆలయం దారి త్రొక్కలేని పాడుపాదాలవారినీ, భగవంతుని మహాభక్తుల పాదధూళి మహాతీర్థాలన్నింటిసారం అని తెలిసికోలేని పాడుతెలివి కలవారినీ, వారివారినీ, వారిని చేరినవారినీ మొట్టమొదటగా కట్టి నాదగ్గరకు తీసుకొనిరండి.
6-190 అరయఁదనదు జిహ్వ... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
అరయ దనదు జిహ్వ హరిపేరు నుడువదు
చిత్త మతని పాదచింత జనదు
తలప దమకు ముక్తి తంగేటి జున్నొకో?
సకల విష్ణుభక్తులకును బోలె.

iBAT సందర్భం

భగవద్భక్తులు కాని వారి దౌర్భాగ్యజీవితాన్ని యమధర్మరాజు వెక్కిరింతగా కక్కసించు కుంటున్నాడు.

iBAT తాత్పర్యము

తన నాలుక ఒక్కమారైనా హరిపేరును పలుకదు. చిత్తం శ్రీపతి పాదాలను పొరపాటున కూడా భావించదు. కానీ నిరంతరం నామజపం, హరిధ్యానం చేసేవారికి లాగా ముక్తి అనే తంగేటిజున్ను కావాలి అంటాడు బుద్ధిహీనుడు. ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది? ఏమాత్రమూ వివేకంలేనివాని తీరు ఇలా ఉంటుంది!
6-191 పద్మనయను మీఁది... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
పద్మనయను మీది భక్తి యోగం బెల్ల
ముక్తి యోగ మనుచు మొద లెఱుంగు
వారి, వారివారి, వారి జేరినవారి
త్రోవ బోవవలదు దూతలార!

iBAT సందర్భం

భటులారా! మీకొక హెచ్చరిక. శ్రద్ధగా వినండి అంటున్నాడు ధర్మమూర్తీ సమవర్తీ అయిన యమధర్మరాజు.

iBAT తాత్పర్యము

జీవులు మరణించే సమయంలో మన లోకాలకు రావలసినవారెవరో, రాగూడని వారెవరో వివేకంతో గమనించండి. ఆ పద్మపత్రాలవంటి అందాలు చిందించే అద్భుతమైన కన్నులుగల శ్రీ మహావిష్ణువునందు చెదరని భక్తి ఉండటమే ముక్తియోగం. ఆ జ్ఞానం ఉన్నవారూ, వారివారూ, వారిని చేరినవారూ పోయిన దారిలో కూడా మీరు పోరాదు.
6-193 స్వాయంభువ మనువేళల... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
స్వాయంభువ మనువేళల
నో యయ్య! సురాసు రాండ జోరగ నర వ
ర్గాయత సర్గము దెలిపితి
పాయక యది విస్తరించి పలుకం గదవే!

iBAT సందర్భం

అజామీళుని కథ వింటున్న పరీక్షిన్మహారాజునకు హృదయం పరవశించిపోతున్నది. మెల్లగా తేరుకొని శ్రీశుకమహర్షుల వారిని మరొక విషయం అడుగుతున్నాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! జ్ఞానమూర్తీ! శుకమహర్షీ! ఇంతకు పూర్వం నీవు స్వాయంభువ మన్వంతరంలో ఉన్న దేవతలను, రాక్షసులను, పక్షులను, పాములను, నరులను, ఇంకా తక్కినజాతులను, వారికి సంబంధించిన సృష్టినీ గురించి చెప్పావు. దానిని మఱికొంత విస్తరించి చెప్పు మహాత్మా!
6-200 తప్పక యర్భకావళికిఁ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
తప్పక యర్భకావళికి తల్లియు దండ్రియు, నేత్రపంక్తికిన్
ఱెప్పలు, నాతికిం బతి, నరేంద్రుడు లోకుల కెల్ల, నర్థికి
న్నొప్ప గృహస్థు, మూఢులకు నుత్తము లెన్నగ వీరు బంధువుల్
ముప్పున గావలేని కడుమూర్ఖులు గారు నిజాల బంధువుల్

iBAT సందర్భం

ఒకప్పుడు ప్రచేతసుని కుమారులు ప్రాచీనబర్హి మొదలైన పదిమంది సముద్రం నుండి భూమిమీదకు వచ్చారు. భూమి అంతా చెట్లతో నిండి ఉన్నది. అది చూచినవారికి ఒళ్ళుమండింది. ముఖాలనుండి గొప్ప గాలితో కూడిన అగ్నిని పుట్టించి చెట్లను కాల్చి వేస్తున్నారు. అప్పుడు చంద్రుడు అది గమనించి యిలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

పుణ్యాత్ములారా! పసిపిల్లలకు అమ్మానాన్నలు, కన్నులకు రెప్పలు, నాతికి పతి, లోకులందరికీ రాజూ, అడుగుకొనేవారికి గృహస్వామీ, మూఢులకు ఉత్తములూ నిజమైన చుట్టాలు కానీ, మనకు కీడు మూడినపుడు రక్షింపలేని మూర్ఖులు మాత్రం నిజమైన చుట్టాలు కాదయ్యా!. ఈ చెట్లు నిజమైన బంధువులు. ఎవరైనా ప్రేమనిండారిన తమవారిని తగులబెట్టుకోవాలనుకుంటారా?
6-300 గరుడుని మూఁపుపై... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర చ
ర్మ రుచిరశార్జ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో
త్కర నికరంబు లాత్మకరకంజములం ధరియించి భూతిసం
భరిత మహాష్టబాహుడు కృపామతితో నను గాచు గావుతన్.

iBAT సందర్భం

శ్రీమహాభాగవతంలో భక్తులను పదిలంగా కాపాడే మహామంత్రాలవంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి శ్రీమన్నారాయణ కవచం. జనమేజయునికి శ్రీశుకయోగీంద్రులు పరమాదరంతో బోధించిన ఆ కవచంలోని ఒక అంశం ఇది.

iBAT తాత్పర్యము

శ్రీమహావిష్ణుదేవుడు వేదాత్మకుడైన గరుత్మంతుని మూపుమీద పాదాలు రెండూ చక్కగా నెలకొల్పి ఆసీనుడైయున్నాడు. అప్పటి ఆస్వామి హస్తాలు ఎనిమిది. వానిలో శంఖము, చక్రము, డాలు, వెలుగులు విప్పారజేసే శార్జ్గమనే విల్లు, నందకమనేఖడ్గము, బాణాలు, పాశము, గద మొదలైన సాధనాలు అమరి ఉన్నాయి. అవి మహాబాహువులు కనుక ఎన్నింటికైనా ఏవిధంగానైనా పట్టుకోగలవు. అదే వాని వైభవం. అటువంటి శ్రీమహావిష్ణువు దయార్ద్రహృదయుడై నన్నుకాపాడుగాక!
6-301 ప్రకట మకర... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
ప్రకట మకర వరుణ పాశంబులందుల
జలములందు నెందు బొలియకుండ
గాచుగాక నన్ను ఘను డొక్కడైనట్టి
మత్స్యమూర్తి విద్యమానకీర్తి

iBAT సందర్భం

శ్రీమన్నారాయణ కవచంలోనిదే మరొక ప్రార్థన. జనుడు ఎప్పుడూ ఒక్కచోటనే ఉండడుకదా! ఎక్కడెక్కడో, ఏవేవో పనులమీద తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ అతడు జలాలలో విహరిస్తూ ఉంటే కాపాడవలసివస్తే ఎలా ప్రార్ధన చేయాలో తెలుపుతున్నారు.

iBAT తాత్పర్యము

ఆ దేవాదిదేవుడు అన్నివిధాలైన జీవులనూ కంటికి రెప్ప అయి కాపాడటానికి అనేక అవతారాలు ఎత్తాడు. అందులో మత్స్యావతారం ఒకటి. అది మహోదాత్త మహా కార్యాలు చేసి మహాకీర్తితో వెలుగొందుతున్నది. ఆ అవతారం పొందిన ఆ స్వామి మొసళ్లు, మహాభయంకరమైన వరుణపాశాలూ గల కల జలాలలో ఎక్కడా ఏ ప్రమాదానికీ లోనుకాకుండా నన్ను రక్షించుగాక. రక్షిస్తాడు ఎందుకంటే ఆయన అందరికంటె, అన్నింటి కంటె ఘనమైనవాడు. ఇంకెవరినీ ప్రార్థించి ప్రయోజనంలేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే సర్వరక్షకుడు
6-302 నటుఁడు సమాశ్రిత... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నటుడు సమాశ్రిత మాయా
నటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనో
ద్భటుడు త్రివిక్రమదేవుడు
చటుల స్థలమందు నన్ను సంరక్షించున్

iBAT సందర్భం

జీవుడు నేల మీద తిరుగుతూ ఉన్నప్పుడు కూడా కాపాడవలసినది ఆ దేవదేవుడే. అది తెలిసికొని ప్రార్థించమంటున్నది శ్రీమన్నారాయణ కవచంలోని యీ పద్యం.

iBAT తాత్పర్యము

స్వామి గొప్ప నటుడు. లోకరక్షకుడు ఏ వేషం అవసరమయితే ఆ వేషం వేసుకొని ఆ విధమైన మహిమను ప్రదర్శింపగలవాడు. ప్రపంచాన్నంతా త్రిప్పుతున్న మహామాయ ఆయనను చక్కగా ఆశ్రయించుకొని తన పని తాను చేస్తున్నది. బలిచక్రవర్తి గొప్పబలానికి చాలా అందమైన విధంగా ప్రతిక్రియ చేసిన మహాశక్తిసంపన్నుడు. మొదట వామనుడై అలా అలా బ్రహ్మాండాంతందాకా పెరిగిన త్రివిక్రమదేవుడు. అట్టి ముప్పోకలపోయిన ముకుందుడు నన్ను నేలనెలవులమీద చక్కగా కాపాడుగాక!
6-303 అడవుల సంకటస్థలుల... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
అడవుల, సంకటస్థలుల, నాజిముఖంబుల, నగ్నికీలలం
దెడరుల నెల్ల నాకు నుతి కెక్కగ దిక్కగుగాక శ్రీనృసిం
హుడు కనకాక్ష రాక్షస వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ
క్త్రుడు ఘన దంష్ట్రపావక విధూత దిగంతరు డప్రమేయు డై

iBAT సందర్భం

ప్రాణికి ప్రాణభయం కలిగే తావులన్నింటిలో ఆ మహాస్వామి శ్రీనృసింహమూర్తియై కాపాడుగాక! అని ప్రార్థించమంటున్నది శ్రీమన్నారాయణ కవచం.

iBAT తాత్పర్యము

అడవులలో, ఆపదలు మూడిన ఘోరప్రదేశాలలో, యుద్ధరంగాలలో, అగ్నికీలలలో, ఇంకా విపత్తులు చుట్టుముట్టిన సమయాలలో నాకు ఆ స్వామి దిక్కయి నిలుచుగాక. ఆయన నరసింహస్వామి. హిరణ్యాక్షుడనే భయంకర రాక్షసుని వధించిన ఉగ్రమూర్తి. దిక్కులదరిపోయే అట్టహాస ధ్వనులను వెలువరించే వదనం కలవాడు. చాలా గొప్పవైన కోరలనే అగ్నిజ్వాలలతో దిక్కుల మధ్య భాగాలను కూడా దూరదూరతీరాలకు చెదరగొట్టిన మహానుభావుడు. ఎవ్వరికీ, ఏ కొలతలకూ అందని అప్రమేయుడు.
6-304 అరయఁగ నెల్ల లోకములు... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
అరయగ నెల్లలోకములు నంకిలి నొంద మహార్ణవంబులో
నొరగి నిమగ్మమైన ధర నుద్ధతి గొమ్మున నెత్తినట్టి యా
కిరిపతి, యజ్ఞకల్పు, డురుఖేలుడు నూర్జిత మేదినీమనో
హరుడు, కృపావిధేయుడు సదాధ్వముల న్నను గాచు గావుతన్

iBAT సందర్భం

మానవుడు బ్రతుకుబాటలో ఎన్నో దారులలో పయనించవలసివస్తున్నది. అనుక్షణం అచ్యుతుని అండదండలుంటే కాని అడుగైనా ముందుకు పడదు. అందువలన ఆ అచ్యుతుడు ఆదివరాహరూపంలో అడుగడుగునా కాపాడుగాక అని ప్రార్ధించమంటున్నది శ్రీమన్నారాయణ కవచం

iBAT తాత్పర్యము

లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. భూదేవి రక్కసుని ఉక్కుకోరలలో చిక్కుకుని మహాసముద్రంలో ఒరిగి మునిగిపోయింది. శ్రీమహావిష్ణువు ఒక్కపెట్టున ఆదివరాహమూర్తియై యజ్ఞస్వరూపం కల్పించుకుని, గొప్ప ఆటగా తన కొమ్ముతో ఆమెను ఉద్ధరించాడు. భూదేవి హృదయాన్ని కొల్లగొట్టాడు. సర్వలోకవాసులందరియందూ జాలువారే కరుణతో అలరారేవాడు. అట్టి స్వామి నేను పోయే దారులన్నింటిలోనూ నన్ను కాపాడుగాక!
6-305 రాముఁడు రాజకులైక... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
రాముడు, రాజకులైక వి
రాముడు, భృగు సత్కులాభిరాముడు, సుగుణ
స్తోముడు, నను రక్షించును
శ్రీమహితోన్నతుడు నద్రిశిఖరములందున్.

iBAT సందర్భం

నేను ఏ కొండకొమ్ములందో తిరుగవలసివస్తుంది. కొండకొమ్ములంటే ఘోరమైన ఆపదలు. అక్కడ నాకు సంభవించే ఆపదలనుండి నన్ను కాపాడే స్వామి ఆ భార్గవరాముడే.

iBAT తాత్పర్యము

ఆయన రాముడు. యోగులందరికీ ఆనందమందించే మనోహరుడు. లోకకంటకులైన నీచక్షత్రియులను వెదకి వెదకి ఇరవై యొక్కమారులు సంహరించిన దుష్టశిక్షకుడు. భృగుమహర్షి వంశానికి ఆనందం కలిగించిన మహాత్ముడు. గొప్పగుణాలన్నీ ఆయనను ఆశ్రయించి ప్రమోదం పొందాయి. శౌర్యలక్షికి ఆటపట్టయి ఉన్నత శిఖరాలందుకొన్న ఆ పరశురాముడు పర్వతశిఖరాలమీద నన్ను పరిరక్షించాలి
6-306 తాటక మర్దించి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తాటక మర్దించి తపసి జన్నము గాచి హరువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి
ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర ఖరదూషణాది రాక్షసుల దునిమి
వానరవిభు నేలి వాలి గూలగ నేసి జలరాశి గర్వంబు జక్కజేసి
సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమి ద్రుంచి

(తేటగీతి)

అలవిభీషణు లంకకు నధిపుజేసి
భూమిసుత గూడి సాకేతపురమునందు
రాజ్యసుఖములు గైకొన్న రామవిభుడు
వరుస నను బ్రోచుచుండు ప్రవాసగతుల

iBAT సందర్భం

దుష్టశిక్షణకోసం, శిష్టరక్షణకోసం, ధర్మస్థాపనకోసం తన మహావైభవాన్నంతా తగ్గించుకొని మానవుడై అవతరించి మహాద్భుతకార్యాలు ఆచరించిన దశరథ మహారాజు తనయుణ్ణి ప్రార్థించి పరదేశాలలో సంభవించే పాటులనుండి కాపాడుకోమంటున్నది శ్రీ మన్నారాయణ కవచం

iBAT తాత్పర్యము

శ్రీరామచంద్రుడు పసితనంలోనే కరకు రక్కసి తాటకను సంహరించాడు. తాపసి అయిన విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించాడు. శివుని విల్లు ఫెళ్లున విరిచి సీతమ్మను చేపట్టాడు. ధైర్యంతో విజృంభించి మహాబలవంతులైన విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను రాచి రంపాన పెట్టాడు. కోతుల ఏలిక అయిన సుగ్రీవుణ్ణి ఏలుకున్నాడు. వాలినొక్క కోలతో కూలనేశాడు. లంకకు చేరుకోవటానికి దారి ఇవ్వకపోతే సముద్రాన్నే గడగడలాడించాడు. సాగరానికి సేతువుకట్టాడు. లంకకు చేరుకొని రావణుడు, కుంభకర్ణుడు మొదలైన క్రూరాత్ములను క్రుళ్ళబొడిచి చంపివేశాడు. రాక్షసుడైనా ఉత్తమ గుణాలు గల విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశాడు. భూదేవి ముద్దుబిడ్డ అయిన జానకితో కూడుకొని సాకేతపురంలో జనరంజకంగా రాజ్యమేలాడు. అటువంటి రామభద్రుడు నన్ను పరసీమలలో పరిరక్షించుగాక!
6-636 దండంబు యోగీంద్ర... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
దండంబు యోగీంద్రమండల నుతునకు దండంబు శార్జ్గకోదండునకును
దండంబు మండిత కుండలద్వయునకు దండంబు నిష్ఠుర భండనునకు
దండంబు మత్తవేదండ రక్షకునకు దండంబు రాక్షసఖండనునకు
దండంబు పూర్ణేందుమండల ముఖునకు దండంబు తేజః ప్రచండునకును

(తేటగీతి)

దండ మద్భుత పుణ్యప్రధానునకును
దండ ముత్తమ వైకుంఠధామునకును
దండ మాశ్రితరక్షణ తత్పరునకు
దండ మురుభోగినాయక తల్పునకును

iBAT సందర్భం

వృత్రాసురుడు దేవతల పాలిట తోకచుక్క అయి వారిని కాల్చుకుతింటున్నాడు. అతని బాధలకు తాళలేని ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీ మహావిష్ణువునకు మొరపెట్టుకున్నారు. ఆయన అనుగ్రహబుద్ధితో వారికి దర్శనం అనుగ్రహించాడు. వారు ఆయనను ఇలా స్తుతిచేస్తున్నారు.

iBAT తాత్పర్యము

మహాయోగుల మండలమంతా గొంతెత్తి నీగుణగణాలను నుతిస్తూనే ఉంటుంది. అట్టి నీకు దండం. ‘శార్ఙ్గం’ అనే గొప్ప కోదండంతో దుష్టులను దండించే దండిమగనికి నీకు దండం. అత్యద్భుత ప్రభలను వెదజల్లే కుండలాలజంటతో అలరారే స్వామికి దండం. అతిఘోరమైన పోరులలో ఆరితేరిన అయ్యకు దండం. గజేంద్రుణ్ణి కాపాడిన కరుణామయునికి దండం. రాక్షసులను ముక్కలుముక్కలుగా నరికిపోగులుపెట్టే స్వామికి దండం. నిండుజాబిలి వంటి నెమ్మోముతో విరాజిల్లే సుందరమూర్తికి దండం. ఎట్టివారికైనా తట్టుకోరాని తేజస్సుతో అతితీవ్రంగా ప్రకాశించే అద్భుతమూర్తికి దండం. అద్భుతమైన పుణ్యం ప్రధానమై భాసిల్లే స్వామికి దండం. ఉత్తమమైన వైకుంఠమే మందిరమైన మాధవునకు దండం. ఆశ్రయించిన వారిని రక్షించటానికి ఆరాటపడే దయామూర్తికి దండం. వేయిపడగలలో విరాజిల్లే ఆదిశేషునిపై పవ్వళించే పరమాత్మకు దండం.
6-339 అకట దిక్కుల కెల్ల... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
అకట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు
నొక్క దిక్కును లేదు కా లూన నైన
దిక్కుగావయ్య! నేడు మా దిక్కు జూచి
దిక్కులేకున్నవారల దిక్కు నీవ

iBAT సందర్భం

వృత్రాసురుడు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేని దేవతలు శ్రీమహావిష్ణువుకు మొరపెట్టు కుంటున్నారు. కాపాడవలసినదిగా శ్రీవాసుదేవునకు విన్నవించుకుంటున్నారు

iBAT తాత్పర్యము

దేవా! మేము దిక్కులన్నింటికీ పాలకులం. కానీ స్వామీ మేము కాలుపెట్టటానికైనా దిక్కులేనివారమైనాము. నేడు మా దిక్కు చూచి మమ్ములను కాపాడు. దిక్కులేనివారలకు దిక్కు నీవేకదా!
6-340 నీ దిక్కు గానివారికి... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీ దిక్కు గానివారికి
నే దిక్కును వెదక నుండ దిహపరములకున్
మోదింప దలచువారికి
నీదిక్కే దిక్కు సుమ్ము! నీరజనాభా!

iBAT సందర్భం

వైకుంఠవాసునకు దిక్పాలకులైన దేవతలు ఇలా మొరపెట్టుకుంటున్నారు. వృత్రాసురుని చిత్రహింసల నుండి సంరక్షించే బాధ్యత నీదే అంటున్నారు.

iBAT తాత్పర్యము

పద్మనాభా! నీవైపు చూపుపెట్టనివారికి ఎంత వెదికినా ఎక్కడ వెదికినా ఈ లోకంలో నయినా, పరలోకంలోనయినా ఏదిక్కూ ఉండదు. ప్రమోదం పొందాలనుకునేవారికి నీదిక్కే దిక్కుసుమా! కనుక మమ్ములనందరినీ ఆదుకొనే ఆదిదేవా! అసురమర్దనా! కాపాడు. కాపాడు. కాపాడు.