iBam భాగవతం ఆణిముత్యాలు

ద్వాదశ స్కంధం

భవిష్య నృపాల వివరం

12-5 చతురత నీ క్షితి... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
చతురత నీ క్షితి నేలియు
మతి మోహము విడువలేక మానవనాథుల్
సతతముఁ దమ కీ కాలం
బతిచంచల మగుట నెఱుఁగరయ్య! మహాత్మా!

iBAT సందర్భం

శుకయోగీంద్రులు పరీక్షిన్మహారాజునకు భవిష్యత్తులో భూమిని పాలించే రాజుల స్థితి గతులను రాబోయే కాలానికి సంబంధించిన విశేషాలను ఇలా వర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా ! భూమిని పాలించే రాజులు ఎంతో నేర్పుతో పరిపాలించి కూడా మనస్సులో పాతుకుపోయిన మోహాన్ని విడిచి పెట్టలేక పడరాని పాట్లు పడుతూ ఉంటారు. కాలం అతి చంచలమైనది, అంటే ఏదో ఒకనాడు తాము చనిపోవాలి అనే విషయాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు . పరమార్గం పరిధి లోనికి పోవాలి అనే భావనయే వారికి కలుగదు.
12-6 నరపతుల మహిమ నంతయు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నరపతుల మహిమ నంతయు
నురగాధిపుఁ డైన నొడువ నోపఁడు; ధాత్రిం
జిరకాల మేలి యిందే
పరువడి నణఁగుదురు వారు భ్రాంతులు నగుచున్.

iBAT సందర్భం

బ్రతుకు శాశ్వతం కాదనే భావననే పట్టించుకోని అజ్ఞానుల మన:స్థితిని శుకుడు పరీక్షిత్తునకు ఇలా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

రాజా ! వారు నరపతులు అంటే నరుల నందరిని కన్నబిడ్డలలాగ పాలించే బాధ్యత గల వారు కానీ వారి అజ్ఞానం ఎంతగా మిన్నులు ముట్టిందంటే దానిని గూర్చి రెండు వేల నాలుకలు గల ఆదిశేషుడు కూడా చెప్పలేడు . ఎంతో కాలం ఈ ధరణి ని ఏలుతారు, చివరకు ఈ ధరణి యందే తనువు చాలిస్తారు, కానీ పొందవలసిన జ్ఞాన దీపాన్ని పొందలేని భ్రాంతచిత్తులు వారు.
12-7 గజ తురగాది శ్రీలను... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
గజతురగాదిశ్రీలను
నిజ మని నమ్మంగరాదు; నిత్యమును హరిన్
గజిబిజి లేక తలంచిన
సుజనులకును నతనియందుఁ జొరఁగావచ్చున్.

iBAT సందర్భం

శుక మహర్షి పరీక్షిత్తునకునకు ఏది అనర్ధమో ఏది పరమప్రయోజనకరమో వివరించి చెబుతున్నాడు.

iBAT తాత్పర్యము

రాజా ! మానవులు, ముఖ్యంగా మానవ పాలకులు తమకు గొప్ప గజ సంపద, గుర్రాల సంపద మొదలైనవి ఉన్నాయి అని గర్వ పడుతూ ఉంటారు. కానీ, అవి ఏవి నిత్యములు కావు. చూస్తూ ఉండగానే నశించిపోతూ ఉంటాయి. అందువలన వానిని నమ్మి ఉండరాదు .మరి కర్తవ్యం ఏమిటి అంటే అనుక్షణము హరిని స్మరిస్తూ ఉండాలి . ఆ స్మరణ కూడా గజిబిజి లేకుండా ఉండాలి . ఆ విధంగా హృదయంలో ధ్యానించేవారు పరమాత్మను చేరుకుంటారు. వారే సృజనులు.
12-16 ధర్మము సత్యముఁ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ధర్మము సత్యముఁ గీర్తియు
నిర్మలతయు విష్ణుభక్తి నిరుపమ ఘన స
త్కర్మ మహింసావ్రతము
న్నర్మిలి గలవారె పుణ్యు లవనీనాథా!

iBAT సందర్భం

శుక మహర్షి పరీక్షిన్మహారాజునకు పుణ్యాత్ముల లక్షణాలను వక్కాణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

భూపాలా ! ధర్మము, సత్యము, కీర్తి, నిర్మలమైన దయ, విష్ణు భక్తి, సత్ కర్మానుష్టానము, అహింసను వ్రతముగా పాలించుట, అనే మహా గుణాలు పుష్కలంగా ఉన్న వారిని పుణ్యాత్ములు అంటారు.
12-17 ఈ జగం బేలు... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఈ జగం బేలు తొల్లిటి రాజవరులు
కాలవశమున నాయువుల్ గోలుపోయి
నామమా త్రావశిష్టు లైనారు; కాన
సలుపవలవదు మమత నెచ్చట నృపాల!

iBAT సందర్భం

శుక మహర్షి పరీక్షిన్మహారాజునకు మమతను త్రుంచివేసుకోవాలి అని దృష్టాంతపూర్వకంగా చెబుతున్నాడు.

iBAT తాత్పర్యము

రాజా! ఈ భూమి ఎన్నో రాజ్యాలుగా ఏర్పడి ఉన్నది. మునుపటి రాజులు ఎందరో ఎన్నో విధాలుగా దీనిని పాలించారు. కానీ, వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు, వారి పేర్లు మాత్రమే కొన్ని మిగిలివున్నాయి. దీనిని మెలకువతో గమనించుకుంటే తెలియవచ్చే విషయం ఏమిటంటే, ఎప్పుడూ, ఎక్కడా, మమతను నిలుపుకోరాదు.
12-19 ఉత్తమశ్లోకుఁ డన... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఉత్తమశ్లోకుఁ డన నెవ్వఁ డున్నవాడు;
సన్నుతుం డగు నెవ్వఁడు సకల దిశల;
నట్టి పరమేశ్వరునిఁ జిత్తమందు నిలిపి
తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ!

iBAT సందర్భం

శుక మహర్షి తారకమంత్రం వంటి ఉపదేశాన్ని పరీక్షిత్తునకు ఇలా తెలుపుతున్నాడు.

iBAT తాత్పర్యము

రాజా! శ్రీమహావిష్ణువును మహా జ్ఞానసంపన్నులు ఉత్తమ శ్లోకుడు అని ప్రస్తుతించారు. ఉత్తమ శ్లోకుడంటే మానవులందరికీ మేలు కలిగించే కీర్తి కలవాడు అని అర్థం. అతడు ఉన్నవాడు, అంటే నిత్య సత్య స్వరూపుడు. అన్ని దిక్కులలో వివేక సంపద కలవారు అతనిని సన్నుతిస్తారు. అటువంటి పరమేశ్వరుణ్ణి హృదయంలో నిలుపుకుని సత్యము, జ్ఞానము, ఆనందము మొదలైన అతని గుణాలను పలుకుతూ ఉండు.

శుక సందేశం

12-25 ఏను మృతుండ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్య మౌఁ;
గాన హరిం దలంపు; మికఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై;
మానవనాథ! పొందెదవు మాధవలోక నివాససౌఖ్యముల్.

iBAT సందర్భం

శుక మహర్షి పరీక్షిత్తునకు ఉత్తమమైన వివేక ధనాన్ని వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మానవనాథా! నేను చనిపోతాను అనే భయాన్ని మనసులోంచి తీసివెయ్యి. కోట్లకొలది గా మానవులు పుడుతున్నారు, వారందరికీ చావు తప్పనిసరిగా కలుగుతుంది. ఐతే చచ్చిన వాడు మళ్ళీ పుట్టడం సంభవిస్తుంది. అదియే మహా భయంకరమైన సంసారం. అది ఆగిపోవాలి అంటే నీవు శ్రీహరి ని స్మరిస్తూ ఉండు. నీకు ఇటుపైన భూమిలో పుట్టుక కలుగదు. మాధవ లోకంలో నివసించే అదృష్టము, అక్కడి సౌఖ్యాలు నీవు పొందుతావు.

సర్ప యాగం

12-27 మృతియును జీవనంబు... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
మృతియును జీవనంబు నివి మేదినిలోపల జీవకోటికిన్
సతతము సంభవించు; సహజం బిది; చోర హుతాశ సర్ప సం
హతులను దప్పి యాఁకటను బంచత నొందెడు నట్టి జీవుఁడున్
వెతలను బూర్వకర్మభవ వేదన లొందుచుఁ గుందు నెప్పుడున్.

iBAT సందర్భం

శుక మహర్షి పరీక్షిన్మహారాజునకు సంసార దుఃఖ పరంపరను గూర్చి ఇలా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

రాజా! చావు బ్రతుకు అనేవి భూమిపై ఉన్న కోట్ల కొలది జీవులకు ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి . ఇది సహజం ! దొంగలో, అగ్నియో, పాముకాటులో, దప్పికయో, ఆకలియో చావుకి కారణాలు అవుతూ వుంటాయి. ఆ విధంగా జీవుడు వెనకటి జన్మలలో చేసుకున్న కర్మఫలాలను అనుసరించి వేదనలను పొందుతూ ఉంటాడు. దు:ఖాలతో కుమిలిపోతూ ఉంటాడు.

మార్కండేయోపాఖ్యానం

12-35 జగము రక్షింప... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
జగము రక్షింప జీవులఁ జంప మనుపఁ
గర్త వయి సర్వమయుఁడ వై కానిపింతు
వెచట నీ మాయఁ దెలియంగ నెవ్వఁ డోపు?
విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప!

iBAT సందర్భం

భాగవతం ద్వాదశ స్కంధం లో సూత మహర్షి శౌనకాది తాపసులకు మార్కండేయుని కథను స్మృతికి తెచ్చాడు. మార్కండేయుని తపో మహిమకు సంతసించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహర్షి ఇలా అంటున్నాడు !

iBAT తాత్పర్యము

దేవా! వేద రూపా! విశ్వేశా! విశ్వ సన్నుతా! లోకాలన్నింటినీ రక్షించడానికి, జీవులని మరల తనలో లీనం చేసుకోవడానికి, పెంచి పోషించటానికి, కర్తవు నీవే. నీవు సర్వ మయుడవు, అందరిలో అన్నింటిలో ఉన్నది నీవే . ఇటువంటి మహాత్ముడవైన నీ మాయను ఎవడు తెలియగలవాడు!
12-36 బలభిన్ముఖ్య దిశాధినాథ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
బలభిన్ముఖ్య దిశాధినాథ వరులున్ ఫాలాక్ష బ్రహ్మాదులున్
జలజాతాక్ష! పురంద రాది సురులుం జర్చించి నీ మాయలన్
దెలియన్ లేరఁట! నా వశంబె తెలియన్?దీనార్తి నిర్మూల! యు
జ్జ్వల పంకేరుహ పత్ర లోచన! గదా చక్రాంబు జాద్యంకితా!

iBAT సందర్భం

మార్కండేయుడు మహావిష్ణువుతో అతని మాయ ఎట్టివారికిని దాటనలవి కానిది, తెలియజాలరానిది అని వక్కాణిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! నీవు దీనుల ఆర్తి ని నామరూపాలు లేకుండా పోగొడుతావు. గొప్ప కాంతులతో విలసిల్లే పద్మపు రేకులవంటి కన్నులతో విరాజిల్లుతూ ఉంటావు. నీ చేతులలో గద, చక్రము, పద్మమూ మొదలైన మహా పదార్థాలు విలసిల్లుతూ ఉంటాయి. అట్టి ఓ స్వామీ! దేవేంద్రుడు మొదలైన ఎనిమిది దిక్కులను పరిపాలించే మహాత్ములు, మూడవ కన్నుతో విరాజిల్లే శివుడు, నాలుగు ముఖాలతో అలరారే బ్రహ్మ దేవుడు, ఇంకా ఈ వరుసలో అధికార స్థానాలలో ఉన్న అయ్యలు, ఎంతగా చర్చించినా నీ మాయలను తెలుసుకోలేరట, ఇంక నిన్ను తెలియడం నా వశమా!

ద్వాదశాదిత్య క్రమం

12-46 పుష్కరం బందు ద్వారకా... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
పుష్కరం బందు ద్వారకాపురము నందు
మథుర యందును రవిదిన మందు నెవఁడు
పఠన చేయును రమణతో భాగవతము
వాఁడు దరియించు సంసారవార్ధి నపుడ.

iBAT సందర్భం

శుక మహర్షి పరీక్షిన్మహారాజునకు భానువారము నాడు పుణ్య ప్రదేశాలలో భాగవతం పఠిస్తే కలిగే మహాఫలాన్ని వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

రాజా ! పుష్కరమనే తీర్ధం లో కానీ, ద్వారకా పట్టణం లో కానీ , మధురానగరం లోకానీ, ఆదివారం నాడు ప్రీతితో భాగవతాన్ని పఠించేవాడు , సంసారం అనే సముద్రాన్ని వెనువెంటనే తరిస్తాడు.
12-47 శ్రీరమణీ రమణకథా... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రీరమణీరమణ కథా
పారాయణ చిత్తునకును బతికిఁ బరీక్షి
ద్భూరమణున కెఱిగించెను
సారమతిన్ శుకుఁడు ద్వాదశస్కంధములన్.

iBAT సందర్భం

శుక మహర్షి ఈ విధంగా భాగవతం లోని పన్నెండు స్కంధాల స్వరూపాన్ని మనోహరంగా చెప్పాడు అని సూతుడు శౌనకాది మునులతో ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

మహర్షులారా! వ్యాసమహర్షి పుత్రుడు, పుట్టుకతోనే వైరాగ్యపు చివరి అంచులకు చేరుకున్నవాడు ఐన శుక మహర్షి పన్నెండు స్కంధాలలో లక్ష్మీదేవీ మనోనాయకుడైన విష్ణుదేవుని కధా పారాయణము హృదయంలో నిరంతరము చేసే శీలం కల పరీక్షిన్మహారాజునకు సారమైన బుద్ధితో తెలియచెప్పాడు.

శుక స్తుతి

12-49 సకలాగమార్థపారగుఁ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సకలాగమార్థ పారగుఁ
డకలంక గుణాభిరాముఁ డంచిత బృందా
రక వంద్య పాదయుగుఁ డగు
శుకయోగికి వందనంబు సొరిది నొనర్తున్.

iBAT సందర్భం

భాగవతం పదునెనిమిది పురాణాలలో నాయకమణి వంటిది . ఈ భాగవత పురాణాన్ని పఠించేవాడు విష్ణు సాయుజ్యం పొందుతాడు అని శూతుడు ఇంకా ఇలా అంటున్నాడు

iBAT తాత్పర్యము

శుకుడనే యోగీంద్రుడు సమస్తమైన వేదములను తుదిముట్టా అధ్యయనం చేసినవాడు, ఎట్టి మచ్చా లేని గుణములతో మనోహరమైన వాడు, పరమ పూజ్యులైన దేవతలకు కూడా నమస్కరింప దగిన పాదపద్మాలు గలవాడు. అట్టి మహానుభావునికి ఎల్లప్పుడూ నేను వందనం చేస్తూ ఉంటాను.

హరి స్తుతి

12-50 సకలగుణాతీతు సర్వఙ్ఞు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు; నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయారసో ద్భాసితుఁ ద్రిదశాభి; వందిత పాదాబ్జు వనధిశయను
నాశ్రితమందారు నాద్యంత శూన్యుని; వేదాంత వేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని; శంఖ చక్ర గదాసి శార్ఙ్గధరుని

(తేటగీతి)

శోభనాకారుఁ బీతాంబరాభిరాము
రత్నరాజిత మకుట విభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయ పుణ్యదేహుఁ
దలతు నుతియింతు దేవకీతనయు నెపుడు.

iBAT సందర్భం

సూత మహర్షి శౌనకాది మహర్షులకు భాగవతాన్ని ఆద్యంతము కమనీయంగా చెప్పాడు.అటు తరువాత వారందరు ఆనంద సాగరములో తేలియాడుతూ తమ తమ నివాసములకు వెళ్లిన తరువాత సంగతిని ఈ పద్యం తెలియజేస్తున్నది .

iBAT తాత్పర్యము

శ్రీకృష్ణ వాసుదేవుడు జీవులను సంసార సముద్రంలో ముంచే సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలన్నింటికీ అతీతుడు. సర్వ జ్ఞానాలూ కలవాడు. సర్వమునకు ప్రభువు. అఖిల లోకాలకు ఆధారమైనవాడు. ఆది దేవుడు. పరమ దయ అనే రసంతో ఉజ్జ్వలంగా ప్రకాశించేవాడు. దేవతలందరికీ నమస్కరింప దగిన పాదపద్మాలతో అలరారే వాడు. పాల సముద్రంలో పవళించే స్వామి. ఆశ్రితులకు కల్పవృక్షం అయినవాడు. ఆది అంతములు లేని వాడు. వేదాంతములతో మాత్రమే తెలియదగినవాడు. సర్వము తాను ఐన వాడు. కౌస్తుభమనే అమూల్యమైన మణిని, శ్రీవత్సమనే పుట్టుమచ్చను వక్షస్థలము నందు నిలుపుకొనేవాడు. శంఖము,చక్రము, గద, ఖడ్గము, శార్ఙ్గము అనే చాపము అను వానిని ధరించి ఉంటాడు. పరమ మనోజ్ఞమైన ఆకారము కలవాడు. పచ్చని పట్టువస్త్రంతో అందాలని చిందించే భగవంతుడు. తెల్లని పద్మముల కన్నులతో విరాజిల్లే వాడు. అవధులు లేని గొప్పతనం గల పుణ్య దేహం కలవాడు. అటువంటి దేవకీ తనయుడు అయిన వాసుదేవుణ్ణి నేను నిరంతరము స్మరిస్తాను.

ద్వాదశ స్కంధం

12-51 అని యీ రీతి... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అని యీ రీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు సె
ప్పిన సంతుష్ట మనస్కు లై విని మునుల్ ప్రేమంబునం బద్మనా
భునిఁ జిత్తంబున నిల్పి తద్గుణములన్ భూషించుచున్ ధన్యులై
చని రాత్మీయ నికేతనంబులకు నుత్సాహంబు వర్ధిల్లఁగన్.

iBAT సందర్భం

శూత మహర్షి సౌనకాది మహర్షులకు భాగవతాన్ని ఆద్యంతము కమనీయంగా చెప్పాడు.అటు తరువాత వారందరు ఆనంద సాగరములో తేలియాడుతూ తమ తమ నివాసములకు వెళ్లిన తరువాత సంగతిని ఈ పద్యం తెలియజేస్తున్నది

iBAT తాత్పర్యము

లోమహర్షణుని పుత్రుడు, సకల పురాణ విజ్ఞానం పుష్కలంగా తనలో నిలుపుకొన్నవాడు అయిన శూత మహర్షి ఈ విధంగా భాగవత మహా పురాణాన్ని మొదటినుండి చివరిదాకా పరమానందం కలిగేట్టుగా చెప్పాడు. మహర్షులు మరింత ఆనంద సాంద్ర స్థితిని పొంది సంతుష్టులైనారు. పరమానురాగంతో పద్మనాభుణ్ణి హృదయపద్మాలలో కుదురుకొల్పుకున్నారు. అతని గుణాలను నిరంతరము భావిస్తూ ధన్యులై, ఉత్సాహం ఊపి వేస్తూ ఉండగా తమ తమ పర్ణశాలలకు చేరుకున్నారు.

స్తోత్రం

12-52 జనకసుతాహృచ్చోరా... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
జనకసుతా హృచ్చోరా!
జనకవచోలబ్ధ విపిన శైలవిహారా!
జనకామిత మందారా!
జననాదిక నిత్యదుఃఖచయసంహారా!

iBAT సందర్భం

తెలుగుల పుణ్యపేటి మహాకవి బమ్మెర పోతన భాగవత కథా రసాన్ని ఈ విధంగా అందరికీ పంచిపెట్టి తన కృతిపతి ఐన శ్రీరామచంద్రుని స్మరణ చేసుకుంటూ గ్రంధాన్ని ముగిస్తున్నాడు .

iBAT తాత్పర్యము

స్వామీ! శ్రీరామచంద్రా! నీవు పరమ వేదాంతి అయిన జనకుని బిడ్డ సీతాదేవి హృదయాన్ని దొంగలించిన వాడవు. తండ్రి మాట మేరకు అడవులలో, కొండలలో అద్భుత కార్యాలు నిర్వహిస్తూ విహరించిన వాడవు. జనుల కోరికలకు కల్పవృక్షం అయిన వాడవు . పుట్టటం మొదలైన నిత్య దుఃఖాల రాశులన్నింటినీ రూపుమాపే వాడవు. ఇట్టి నీకు అంకితంగా నేను రచించిన భాగవతాన్ని నీ ద్వారా లోకానికి నివేదించుకుంటున్నాను స్వామీ !